
కూటమి ప్రభుత్వ దుర్మార్గ నిర్ణయం
● ప్రాణాలు కోల్పోయిన పారిశుద్ధ్య కార్మికుడు
● నివాళులర్పించిన సీఐటీయూ నాయకులు
నెల్లూరు(బారకాసు): కూటమి ప్రభుత్వ నిర్ణయంతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఇలాకాలో నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన నెల్లూరు నగరంలో సోమవారం చోటుచేసుకుంది. ఎన్‌ఎంసీ పరిధిలోని 45వ డివిజన్ కార్మికుడు జోసఫ్ వయసు 60 ఏళ్లు నిండిందని నిలిపేశారు. దీంతో అతను మానసికక్షోభకు గురై గుండెపోటుతో మరణించాడని ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు ఆరోపించారు. ఆ యూనియన్ నగర గౌరవాధ్యక్షుడు కత్తి శ్రీనివాసులుతోపాటు పలువురు నేతలు మృతదేహానికి నివాళులర్పించారు. శ్రీనివాసులు మాట్లాడుతూ 30 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న జోసఫ్‌కు ఒక్క రూపాయి కూడా బెనిఫిట్ ఇవ్వలేదన్నారు. వారసులకు ఉద్యోగం కల్పించకపోవడంతో బాధిత కుటుంబంలో ఆవేదనలో ఉందన్నారు. వారికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. వారసులకు ఉద్యోగావకాశం కల్పించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.