
ఆధిపత్యంపై పచ్చ నేతల వర్గపోరు
కందుకూరు: పట్టణ నడిబొడ్డున ఉన్న గ్రామదేవత అంకమ్మ తల్లి దేవాలయాన్ని రాజకీయంగా ఆధిపత్యం కోసం తమ్ముళ్లు వేదికగా చేసుకుంటున్నారు. ఆలయ నిర్వహణ పెత్తనం కోసం అధికార పార్టీ లోని రెండు వర్గాల మధ్య పోరు పతాక స్థాయికి చేరింది. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం వర్గం కోర్టును ఆశ్రయించగా, కావాలనే అభివృద్ధిని, దేవాలయ ఆదాయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే ఇంటూరి వర్గం ఆరోపిస్తోంది. ఈ రెండు వర్గాల మధ్య దేవదాయశాఖ వేలంలో షాపులు దక్కించుకున్న వ్యాపారుల పరిస్థితి అయోమయంగా మారింది.
రూ.4 కోట్లపైగా నిధులతో జీర్ణోద్ధరణ
అంకమ్మ తల్లి ఆలయం ఆర్టీసీ డిపో సమీపంలో పట్టణ నడిబొడ్డున ఉంది. ఈ దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు. సంక్రాతి, దసరా పండగల సందర్భంగా భారీ ఎత్తున పార్వేట ఉత్సవాలు, ఐదేళ్లకొకసారి తిరునాళ్ల మహోత్సవం వైభవంగా జరుగుతోంది. జీర్ణావస్థకు చేరిన ఈ ఆలయాన్ని గత ప్రభుత్వ హయాంలో భక్తులు దాదాపు రూ.4 కోట్లకు పైగా విరాళాలు ఇవ్వగా, దేవదాయశాఖ నిధులు కలిపి ఆలయాన్ని అత్యంత సుందరంగా అభివృద్ధి చేశారు. అదే సమయంలో ఆలయ ప్రాంగణాన్ని కూడా అభివృద్ధి చేయాలని అప్పట్లో ప్రణాళిక రూపొందించారు. ఆలయం చూట్టూ ఉన్న విశాలమైన ఖాళీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి అద్దెలకు ఇవ్వాలని, తద్వారా అద్దెలు ఆలయాభివృద్ధికి ఉపయోగపడతాయని భావించారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఆ ప్రణాళికకు ముందడుగు పడలేదు.
ఆలయ పెత్తనమంతా దివి శివరాం కుటుంబానిదే
ఈ ఆలయం మొదటి నుంచి మాజీ ఎమ్మెల్యే దివి శివరాం కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉంది. ఆయన సోదరుడు దివి లింగయ్యనాయుడు గ్రామ దేవతల వారసత్వ ధర్మకర్తగా వ్యవహరిస్తూ పెత్తనం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఎవరు వ్యాపారం చేసుకోవాలన్నా వీరి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. రూ.వందల కోట్ల విలువ చేసే స్థలం, ఆలయంపై వీరి పెత్తనాన్ని తొలగిస్తూ 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు దేవదాయశాఖ పరిధిలోకి ఆలయాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈఓ పర్యవేక్షణలో ఆలయ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇటీవల దేవదాయశాఖ ఆధ్వర్యంలో ఆలయం చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి వ్యాపారులకు కేటాయించేందుకు బహిరంగ వేలం పాట నిర్వహించారు. దాదాపు 24 మంది వ్యాపారులు ముందుకు వచ్చి వేలం పాట ద్వారా రూమ్‌లను దక్కించుకున్నారు. దాదాపు నిర్మాణాలు శ్లాబ్‌లెవల్‌కు వచ్చాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కూడా దివి కుటుంబాన్ని అటు రాజకీయం గాను, ఇటు ఆలయ పెత్తనం నుంచి పూర్తిగా తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దివి కుటుంబంపై పలు ఆరోపణలు కూడా ఎమ్మెల్యే వర్గం నాయకులు చేస్తున్నారు. ఇన్నాళ్లు దేవాలయంపై పెత్తనం చేసిన వాళ్లు ఆలయానికి ఒక్క పైసా ఆదాయం అయినా తెచ్చారా, షాపుల నిర్వహణ ద్వారా ఆదాయం మొత్తం ఎటు పోయిందని బహిరంగంగానే వారిపై ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో ధర్మకర్త దివి లింగయ్యనాయుడు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు ఆలయ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని, తిరునాళ్ల సమయంలో భక్తులకు ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ నెల 21వ తేదీ వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టొద్దని స్టేటస్ కో విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. వేలంపాటలో లక్షలు వెచ్చించి పాడుకున్న తమ పరిస్థితి ఏంటని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంకమ్మతల్లి దేవాలయ
షాపింగ్ కాంప్లెక్స్‌పై వివాదం
కోర్టుకెళ్లి నిర్మాణాలను
అడ్డుకునేందుకు దివి వర్గం ప్రయత్నం
అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే వర్గం మండిపాటు