
నా బాగోగులు పట్టించుకోవడం లేదయ్యా
నెల్లూరు(క్రైమ్): ‘నా కుమారుడు నరసింహ ఆస్తి రాయించుకుని నా బాగోగులు పట్టించుకోవడం లేదు. విచారించి న్యాయం చేయండి’ అని ఆత్మకూరుకు చెందిన ఓ వృద్ధుడు కోరాడు. సోమవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 118 మంది తమ వినతులను ఎస్పీ జి.కృష్ణకాంత్‌కు అందించారు. పరిశీలించి న్యాయం చేస్తామని ఆయన భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఏఎీస్పీ సీహెచ్ సౌజ న్య, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ చెంచురామారావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్‌బీ 2 ఇన్‌స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి, ఆర్‌ఐ రాజారావు, ఫిర్యాదుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● నా కుమార్తెకు ఫిలిప్పీన్స్‌లో డాక్టర్ సీట్ ఇప్పిస్తామని బాలరవితేజ అనే వ్యక్తి నమ్మించి రూ.17 లక్షలు తీసుకున్నాడు. విజిటింగ్ వీసా ఇప్పించి మోసగించాడని పొదలకూరురోడ్డుకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
● నా కుమార్తెకు యూరప్ లక్సెంబర్గ్‌లోని కంపెనీల్లో సూపర్‌వైజర్ ఉద్యోగం ఇప్పిస్తానని మున్వర్, అతని అల్లుడు ఇంతియాజ్, కుమార్తె సబీనాలు రూ.6 లక్షలు తీసుకున్నారు. 17 నెలలు గడుస్తున్నా ఉద్యోగం ఇప్పించకుండా, నగదు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని సంతపేటకు చెందిన ఓ వ్యక్తి వినతిపత్రమిచ్చాడు.
● నాకు నెల్లూరు నగరానికి చెందిన సంపత్‌తో పెళ్లి నిశ్చయమైంది. అతని ప్రవర్తన బాగోలేకపోవడంతో పెళ్లి రద్దు చేసుకున్నాం. సంపత్ నా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో ఇబ్బందులు పెడుతున్నాడు. నాకొచ్చిన పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నాడని నెల్లూరు రూరల్‌కు చెందిన ఓ యువతి ఫిర్యాదు చేశారు.
● నా వద్ద కావలి పట్టణానికి చెందిన దేవరకొండ సుధీర్ రూ.లక్షకు రూ.3 లక్షల పాతనోట్లు ఇస్తానని నమ్మించి రూ.50 లక్షలు తీసుకున్నాడు. పాతనోట్లు ఇవ్వకుండా, నగదు తిరిగివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడని పల్నాడు జిల్లా నరసారావుపేటకు చెందిన ఓ వ్యక్తి అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.
● నా కుమార్తె ఆరునెలల క్రితం నెల్లూరు రూరల్ పరిధికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. భర్త, అత్తమామలు అదనపుకట్నం కోసం వేధించారు. ఈక్రమంలో నా కుమార్తె మరణించింది. మృతిపై అనుమానాలున్నాయని విచారించి న్యాయం చేయాలని నవాబుపేటకు చెందిన ఓ మహిళ కోరారు.
● అదనపుకట్నం కోసం అత్తమామలు వేధిస్తూ ఇంటి నుంచి గెంటేశారు. కౌన్సెలింగ్ నిర్వహించి కాపురాన్ని చక్కదిద్దాలని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు.
● ముదివర్తి గ్రామానికి చెందిన వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై పలుమార్లు బంగారు, నగదు తీసుకున్నాడు. ఇంకా ఇవ్వాలని లేకుంటే వ్యక్తిగత ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతానని బెదిరిస్తున్నాడని విడవలూరుకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.
కుమారుడిపై వృద్ధుడి ఫిర్యాదు
ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
వినతులు స్వీకరించిన ఎస్పీ