
వినతులిచ్చి.. స్పందించాలని కోరి..
నెల్లూరు రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల సంఖ్య తగ్గడం లేదు. ప్రతి వారం పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, డీఆర్వో హుస్సేన్ సాహెబ్, డ్వామా పీడీ గంగాభవాని, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి సమస్యలు తెలుసుకున్నారు. ఈసారి రికార్డు స్థాయిలో 555 అర్జీలను ప్రజలు అందజేశారు. ఎక్కువగా రెవెన్యూ శాఖవి 215, మున్సిపల్ శాఖవి 43, సర్వేకు 48, పంచాయతీరాజ్ శాఖవి 53, పోలీసు శాఖవి 52, సివిల్ సప్లయ్స్‌వి 8 తదితరాలున్నాయి.
విద్యుత్ మీటర్లు ఇప్పించాలి
ఆరు సంవత్సరాల క్రితం పడారుపల్లి సప్తగిరి కాలనీలో కేఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ కలువాయి శ్రీనివాస్‌రెడ్డి అనే బిల్డర్ దగ్గర అపార్ట్‌మెంట్లలో తొమ్మిది ఫ్లాట్లు కొనుగోలు చేశామని, అతను ఇప్పటికీ పూర్తి చేసి ఇవ్వలేదని కొనుగోలుదారులు ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ బ్యాంక్ లోన్ పెట్టామని చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇంటి బాడుగలు భరించలేక కొంత మొత్తం వేసుకుని లిఫ్ట్, ట్రాన్స్‌ఫార్మర్, కరెంట్ మీటర్లు, ఫ్లోరింగ్ మిగతా రిపేర్లు చేయిద్దామంటే అతను తమపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారన్నారు. కరెంట్ మీటర్లు రానివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులు అశోక్‌రెడ్డి, పెళ్లూరు రవి, కృష్ణారెడ్డి, చంద్ర, నరసింహారెడ్డి పాల్గొన్నారు.
● జిల్లాలో యూరియా దుర్వినియోగాన్ని అరికట్టలని బీజేపీ నేత మిడతల రమేష్ విజ్ఞప్తి చేశారు. అధికారులకు వినతిపత్రం అందించిన తర్వాత ఆయన మాట్లాడుతూ యూరియా నిల్వలు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
90 శాతం సబ్సిడీ ఇవ్వండి
కుల వృత్తుల వారికి ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ రుణాలివ్వాలని ఎరుకల సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ్ల శివ వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ బాతుల పెంపకం, ప్లాస్టిక్ వైరుతో బుట్టలు అల్లడం తదితర వృత్తులపై అనేకమంది ఆధారి పడి జీవిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఆయా వృత్తులను గుర్తించి సబ్సిడీ రుణాలివ్వాలన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో నేతలు కట్ట రామారావు, బండి బుజ్జయ్య, కట్టా రమణయ్య, దేవరకొండ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రికార్డు స్థాయిలో 555 అర్జీలు
రెవెన్యూ శాఖవే అధికం
చర్యలు తీసుకోవాలంటూ..
20 ఏళ్లుగా సాగు చేస్తున్న వ్యవసాయ భూమిని కొందరు టీడీపీ నాయకులు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని సైదాపురం మండలం చాగణం గ్రామానికి చెందిన మహిళలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమ్మ సాగు చేస్తున్నామన్నారు. 23 ఎకరాల భూమికి సంబంధించి తమ పేరుపై ప్రభుత్వం ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్ కూడా ఇచ్చిందన్నారు. కొంతమంది ఆక్రమించుకోవాలని చూస్తే హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని ఆర్డర్‌ను రెవెన్యూ అధికారులకు ఇచ్చామన్నారు. అయినా ఇది మా ప్రభుత్వం, మీ దిక్కున్న చోట చెప్పుకోండంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. సువర్ణమ్మ, అనురాధ, పద్మమ్మ, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
రుణాలివ్వకపోవడం అన్యాయం
ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలివ్వకపోవడం అన్యాయమని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్.మల్లి అన్నారు. కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మల్లి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో వారు అధిక వడ్డీలకు నగదు తెచ్చుకుని ఇబ్బందులు పడుతున్నారన్నారు. దళిత, గిరిజనులకు పథకాలు సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. దీంతో వారంతా ఆర్థిక సమస్యల్లో ఇరుక్కున్నట్లు చెప్పారు. తండల వ్యాపారస్తులు అధికార పార్టీ ఎమ్మెల్యేల పేరు చెప్పి దోచుకుంటున్నారని తెలిపారు. కె.శ్రీనివాసులు, బిల్ల మస్తానయ్య, జెడ్డా వాసు, రాజేశ్వరమ్మ, ఆర్.శ్రీనివాసులు, జె.శ్రీనివాసులు, మహిళలు పాల్గొన్నారు.

వినతులిచ్చి.. స్పందించాలని కోరి..

వినతులిచ్చి.. స్పందించాలని కోరి..

వినతులిచ్చి.. స్పందించాలని కోరి..