
రీ కౌన్సెలింగ్‌లోనూ అన్యాయమే
నెల్లూరు (అర్బన్): ఒక దఫా కౌన్సెలింగ్ జరిపి బదిలీలు చేసినా, ఉన్నతాధికారుల ఆదేశాలంటూ మళ్లీ రీ కౌన్సెలింగ్ నిర్వహించి తీవ్ర అన్యాయం చేశారని పెద్ద సంఖ్యలో సచివాలయాల గ్రేడ్–3 ఏఎన్‌ఎంలు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎన్‌ఎం అసోసియేషన్ నాయకురాలు సుకన్య మాట్లాడుతూ నాలుగు నెలల క్రితం సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్–3కి చెందిన 289 మంది ఏఎన్‌ఎంలకు గ్రేడ్–2 ఏఎన్‌ఎంలుగా ప్రమోషన్లు కల్పించి పీహెచ్‌సీల్లోని సబ్ సెంటర్లకు బదిలీ చేశారన్నారు. అయినప్పటికీ వారు అధికారులను మేనేజ్ చేసుకుని ప్రమోషన్ పొందిన ప్లేస్‌ల్లోకి వెళ్లకుండా పట్టణ ప్రాంతంలోనే సచివాలయాల్లో కొనసాగుతున్నారన్నారు. ప్రమోషన్లు పొందిన వారు తమ ప్రాంతాలను వదలకపోవడంతో బదిలీ అయిన తమకు కేటాయించిన పట్టణ ప్రాంతాలకు రాలేకపోయామన్నారు. అయితే ఇప్పుడు మళ్లీ రీ కౌన్సెలింగ్ జరుపుతూ పట్టణ ప్రాంతాల ఖాళీలను చూపడం లేదంటూ గ్రామీణ ప్రాంతాల్లోని ఖాళీలను మాత్రమే విడుదల చేశారన్నారు. ఈ క్రమంలో తాము గ్రామీణ ప్రాంతాల్లోని సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. అయితే పలువురు లంచాలు ఇచ్చి పట్టణ ప్రాంతాలకు కూడా బదిలీ అయ్యారన్నారు. ఉదాహరణగా కౌన్సెలింగ్ లిస్టులో చివరగా 457వ స్థానంలో ఉన్న ఓ సచివాలయం ఏఎన్‌ఎం మర్రిపాడు మండలం సింగనమల సచివాలయానికి ఆప్షన్ ఇచ్చిందన్నారు. అయితే ఆర్డర్ తీసుకునేటప్పుడు ఆశ్చర్యంగా ఆమె నెల్లూరు పట్టణంలోని రాజీవ్ గృహ కల్పకు మారిందన్నారు. ఇదేలా సాధ్యమయిందని ప్రశ్నించారు. చివరి వరుసలో 444 స్థానంలో ఉన్న మరో ఏఎన్‌ఎం అసలు కౌన్సెలింగ్‌లోనే పాల్గొన లేదన్నారు. అయితే ఆమెకు మాత్రం ఏకంగా నెల్లూరు నగరంలో పోస్టింగ్ ఇచ్చారన్నారు. ఇలా జరగడానికి పెద్ద ఎత్తున డబ్బులు మారడం, రాజకీయ నాయకుల పాత్రే కారణమని ఆరోపించారు. చిన్నచిన్న బిడ్డలున్న వారు, వితంతులు ఈ అసంబద్ధ కౌన్సెలింగ్ వల్ల తీవ్ర కష్టాలు పడుతున్నారన్నారు. అందువల్ల జరిగిన కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్లు పొందిన వారు బదిలీ కాబడిన స్థానాలకు వెళ్లిన తర్వాతనే తమకు బదిలీలు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో తేజ, భారతి, రమణమ్మ తదితర పలువురు ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్ద సచివాలయ ఏఎన్‌ఎంల ధర్నా