
17న వెంగమాంబకు నెల పొంగళ్లు
దుత్తలూరు: మండలంలోని నర్రవాడలో కొలువైన వెంగమాంబ పేరంటాలకు ఈ నెల 17వ తేదీ నెల పొంగళ్ల కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ఉషశ్రీ సోమవారం తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో వెంగమాంబ దంపతుల కల్యాణం జరిగిన నాటి నుంచి 30వ రోజు ఈ నెలపొంగళ్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అదే రోజు సమరసత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమ్మ వారికి ఆషాడం సారె సమర్పిస్తారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
పంటలకు ఎరువుల
కొరత లేకుండా చర్యలు
కోవూరు: జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వరి, ఇతర పంటలు సుమారు 1.50 లక్షల హెక్టార్లలో సాగు జరుగుతోందని, అవసరమైన యూరియా సరఫరా నిరాటంకంగా సాగుతోందని జిల్లా వ్యవసాయ అధికారి పి. సత్యవాణి తెలిపారు. సోమ వారం ఆమె పడుగుపాడు రేక్ పాయింట్ వద్ద యూరియా దిగుమతి తీరును పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ సీజన్ ప్రారంభంలోనే ఎరువుల అవసరాలను అంచనా వేసి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తూ యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుత సీజన్‌కు 47,588 మెట్రిక్ టన్నుల యూరి యా అవసరం కాగా, ఇప్పటి వరకు 32,714 మెట్రిక్ టన్నులు ఏప్రిల్ నుంచి రైతులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కోవూరు, నెల్లూరు వ్యవసాయ డివిజన్ పరిధిలో వరి ఇప్పటికే చిరుపొట్ట దశకు చేరినట్లు, కావలి, ఆత్మకూరు, పొదలకూ రు డివిజన్లలో వరి నాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు వివరించారు. సోమవారం పడుగుపాడు రేక్ పాయింట్ ద్వారా జిల్లాకు ఎన్‌ఎఫ్‌సీఎల్ యూరియా 1,850 మెట్రిక్ టన్నులు వచ్చా యి. అందులో 850 మెట్రిక్ టన్నులు ప్రైవేట్ డీల ర్ల ద్వారా, 1,000 మెట్రిక్ టన్నులు మార్క్‌ఫెడ్ ద్వారా రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాల ద్వారా పంపిణీకి సరఫరా చేసినట్లు తెలిపారు. రైతులు ఎక్కువ యూరియా వాడడం వల్ల పురుగులు, తెగుళ్లు పెరగడం, సూక్ష్మ పోషక లోపాల కారణంగా దిగుబడిలో తగ్గుదల సమస్యలు తలెత్తుతున్నాయని హెచ్చరించారు. ముఖ్యంగా చిరుపొట్ట దశలో ఎకరాకు కనీసం 25 కిలోల పొటాష్ ఎరువు వాడాలని రైతులకు సూచించారు. ఆమె వెంట కోవూరు సహాయ వ్యవసాయ సంచాలకులు జి. అనిత ఉన్నారు.
అగ్రిగోల్డ్ భూముల్లో
జామాయిల్ నరికివేత
అనుమసముద్రంపేట: మండలంలోని జమ్మవరం గ్రామంలో చెరువు వద్ద ఉన్న అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ కర్రను అనంతసాగరం మండలం మినగల్లు గ్రామానికి చెందిన రమణారెడ్డి అనే వ్యక్తి నరికించి అమ్ముకుంటున్నాడని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ అనిల్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువు కట్ట మీద కంపకర్రను జమ్మవరం గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు పంచాయతీ అనుమతి లేకుండానే రమణారెడ్డికి అమ్మాడన్నారు. అతను కంపకర్రతోపాటు అగ్రిగోల్డ్ భూముల్లోని జామాయిల్ కర్రను సైతం కొట్టించి తరలించాడని చెప్పారు. సీఐడీ అటాచ్‌మెంట్‌లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూముల్లోని కర్రను ఎలా కొడతారని ప్రశ్నించారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

17న వెంగమాంబకు నెల పొంగళ్లు