
ఏపీపీఎస్సీ పరీక్షలను పక్కాగా నిర్వహించాలి
● డీఆర్‌ఓ హుస్సేన్ సాహెబ్
నెల్లూరురూరల్: ఏపీపీఎస్సీ పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా పక్కాగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని డీఆర్వో హుస్సేన్‌సాహెబ్ అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్‌లోని డీఆర్వో చాంబర్‌లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూడు నోటిఫికేషన్లకు సంబంధించి నిర్వహిస్తున్న లెక్చరర్ పోస్టుల పరీక్షల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో డీఆర్వో సమీక్షించారు. డీఆర్వో మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు లెక్చరర్ పోస్టుల పరీక్షలకు జిల్లాలో ముత్తుకూరు రోడ్డులో ని నారాయణ ఇంజినీరింగ్ కళాశాల, పొట్టేపాళెంలోని ఆయాన్ డిజిటల్ జోన్, కడనూతలలోని రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసినట్లు చెప్పా రు. ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం 2 గంటల తరువాత అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని చెప్పారు. అభ్యర్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని, అభ్యర్థులకు సరిపడా ఆర్టీసీ బస్సులు నడపాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్యారోగ్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని వైద్యాధికారిని ఆదేశించారు. తాగునీరు ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లుపై చీఫ్ సూపరింటెండెంట్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావొద్దని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ అధికారులు ప్రసాద్‌కుమార్, ఎం.శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.