
నన్ను, నా కుమారుడ్ని చంపేసేవారు: ప్రసన్న
నెల్లూరు (బారకాసు): ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాదిగా రాక్షస పాలన సాగిస్తోందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీమంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్ విమర్శించారు. ఆ రోజు ఇంట్లో ఉంటే తనను, తన కుమారుడిని చంపేసే వారని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అమానవీయంగా, అప్రజాస్వామ్యంగా ఉందని మండిపడ్డారు. సోమవారం నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని చూసి రాష్ట్రం ఒక్కసారిగా ఉలికి పడిందన్నారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడా ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని, ఇప్పుడు ఈ దాడి గురించి ప్రజలు చర్చించుకుంటున్నారని చెప్పారు. మారణాయుధాలతో వచ్చిన టీడీపీ గూండాలు ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో ఉండి ఉంటే హతమార్చే వారని ప్రతి ఒక్కరికీ అర్థమవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు, వారి ఇళ్లపై దాడులు చేస్తూ టీడీపీ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఈ నెల 7వ తేదీ దాడి జరిగితే కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయకుండా ఆరు రోజుల తర్వాత గుర్తుతెలియని వ్యక్తులని కేసు నమోదు చేయడం చూస్తే పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు అద్దం పడుతుందన్నారు. గతంలో టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ దాడిని ప్రోత్సహించారని ఆయనపై కేసు నమోదు చేసి నాలుగు నెలల పాటు రిమాండ్‌కు పంపారని అని గుర్తు చేశారు.
రాజ్యాంగం అపహాస్యం : అనిల్
టీడీపీ ఈ రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ, వారి ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందని మాజీమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ మండిపడ్డారు. ప్రసన్నకుమార్‌రెడ్డిని హతమార్చేందుకే టీడీపీ గూండాలు ఆయన ఇంట్లోకి చొరబడ్డారన్నారు. దాడికి సంబంధించి అన్ని ఆధారాలు ఇచ్చి కేసు నమోదు చేయమని కోరినా, ఎఫ్‌ఐఆర్‌లో ఎవరి పేర్లు లేకుండా పోలీసులు కేసు నమోదు చేసిన తీరు దుర్మార్గమన్నారు. ఒక మాజీమంత్రికే ఈ జిల్లాలో రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజలకు ఇంకెక్కడ రక్షణ ఉంటుందన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఆ జిల్లా ప్రథమ పౌరురాలు, బీసీ మహిళ జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాలు విచక్షణా రహితంగా మారణాయుధాలతో దాదాపు ఒకటిన్నర గండసేపు దాడి జరిగితే అధికారంలో ఓ మంత్రి, బీసీ నేత ఖండించకపోగా ఆయన మాట్లాడిన భాష, ఆమెను మహానటి అని వ్యాఖ్యానించడం సిగ్గు చేటని విమర్శించారు. అదే కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఒకటిన్నర సంవత్సరం నుంచి నానా రకాల భాషలు మాట్లాడుతూ, అరాచకాలు చేస్తూ, ఒక ఇంటిని కూల్చేయొ చ్చు. ‘మాజీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలను వాడు, వీడు, పశువులు, ఆంబోతులు’ అని అంటే మాత్రం అమాయకురాలా?. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జి కోట వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు దారుణ హత్య ఎంతో కలకలం సృషించిన విషయం అందరికి తెలిసిందేనన్నారు. ఈ ఘటన ఏమాత్రం కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు.
● నెల్లూరురూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు విమర్శలు సహజమని, విమర్శలు చేసినప్పుడు తిరిగి విమర్శించాలే తప్ప దాడు ల సంస్కృతి సరికాదన్నారు. అధికారంలో ఉన్నామన్న అహంకార ధోరణితో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి వ్యవహరించడం దారుణమన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా రాజకీయ చరిత్ర కలిగిన నలపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కుటుంబమన్నారు. ప్రసన్నకుమార్‌రెడ్డిని చంపేయాలని దాడి చేశారని, ఆయన తల్లిని భయభ్రాంతులకు గురి చేశారని ఇది అత్యంత దుర్మార్గమన్నారు.
మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో విధ్వంసం సైకోయిజం
పోలీసులు వ్యవహరిస్తున తీరు
అమానవీయం
ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి,
మాజీ మంత్రి అనిల్
ఇంట్లో ఉండి ఉంటే నన్ను,
నా బిడ్డను చంపేసే వారు : ప్రసన్న
ప్రశాంతిరెడ్డి గురించి ఎక్కడా తాను వ్యక్తిగతంగా మాట్లాడలేదని మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తనను, తన కుమారుడిని చంపాలని 200 మంది టీడీపీ గూండాలను పంపి నా ఇల్లును ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ధ్వంసం చేయించిందన్నారు. ప్రశాంతిరెడ్డి ఈ మధ్య ప్రెస్‌మీట్ పెట్టి అప్పుల్లో, పర్సంటేజీల్లో, లంచాల్లో ప్రసన్నకుమార్‌రెడ్డి పీజీ చేశాడని నా గురించి వ్యక్తిగతంగా ఆరోపణలు చేసిందన్నారు. దీంతో తాను కూడా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి సంబంధించి కొన్ని వాస్తవాలు మాట్లాడానని చెప్పారు. దీన్ని జీర్ణించుకోలేకనే విధ్వంసానికి తెగబడ్డారన్నారు. ఇది టీడీపీ రెడ్‌బుక్ పాలనకు నిదర్శనమన్నారు. నా ఇంటిపై దాడికి సంబంధించి పోలీసులకు అన్ని ఆధారాలు ఇచ్చినా కేసు నమోదు చేయని పోలీసులు చివరకు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారన్నారు. ప్రశాంతిరెడ్డి నాపై ఫిర్యాదు ఇచ్చిన రెండు గంటల్లోనే పోలీసులు కేసు నమోదు చేశారని, పోలీసుల వ్యవహార శైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నన్ను, నా కుమారుడ్ని చంపేసేవారు: ప్రసన్న