
జీఓ 36 మేరకు జీతాలివ్వాలి
నెల్లూరు(బారకాసు): కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తించే కార్మికులకు జీఓ నంబర్ 36 మేరకు జీతాలివ్వాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి పెంచలనరసయ్య, సీఐటీయూ నగర కార్యదర్శి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు విధులను ఆదివారం బహిష్కరించారు. గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ వరకు చేపట్టిన ర్యాలీలో వారు మాట్లాడారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు, సంబంధిత అధికారులను పలుమార్లు కలిసినా, ప్రయోజనం లేదని ఆరోపించారు. చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విధిలేకే సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు. సమస్యలను పరిష్కరించకపోతే విధులను పారిశుధ్య కార్మికులు ఈ నెల 17 నుంచి బహిష్కరించి సమ్మెలోకి వెళ్లనున్నారని స్పష్టం చేశారు. సీఐటీయూ ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ, శివాజీ, సురేష్, మున్సిపల్ ఇంజినీరింగ్ నేతలు శ్రీనివాసులు, బాలు, మనోజ్, జిల్లా అధ్యక్షురాలు కామాక్షమ్మ, నెల్లూరు నగరాధ్యక్ష, కార్యదర్శులు సునీల్, అశోక్, నేత సుజాతమ్మ తదితరులు పాల్గొన్నారు.