
విచారణ పేరిట ఇబ్బంది పెడతారా..?
● బస్టాండ్ సెంటర్‌లో ఆందోళన
ఉదయగిరి: పట్టణంలోని ఆల్‌ఖైర్ ఫంక్షన్ హాల్ ఆస్తి వివాదం నేపథ్యంలో జరిగిన హత్యను ఉదయగిరి బీసీ కాలనీకి చెందిన ఓ యువకుడు తన ఫోన్లో చిత్రీకరించారు. గమనించిన నిందితులు దాడికి యత్నించడంతో భయంతో పరారయ్యారు. ఈ దృశ్యాలను సదరు యువకుడు తన మిత్రులకు షేర్ చేయడంతో వీడియో వైరలైంది. దీంతో కేసులో ఈ వీడియో పోలీసులకు కీలకంగా మారింది. సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకునేందుకు గానూ యువకుడి తల్లిదండ్రులను మూడు రోజులుగా స్టేషన్‌కు పిలిపించి ఆచూకీ చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారు. తమ కుమారుడి ఆచూకీ తెలియక అల్లాడుతుంటే, ఇబ్బంది పెట్టడమేమిటంటూ స్థానిక పంచాయతీ బస్టాండ్ సెంటర్‌లో ఆందోళనను ఆదివారం చేపట్టారు. సుమారు 200 మంది బీసీ కాలనీ వాసులు రోడ్డును దిగ్బంధించారు. దీంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వీరిని శాంతింపజేసేందుకు యత్నించారు. పోలీసులు.. ఆందోళనకారుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం ఆందోళనను విరమించారు.