
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
గుడ్లూరు: లారీని బొలెరో ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన తెట్టు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్సై వెంకట్రావు కథనం మేరకు.. ఏలూరు జిల్లా కలిదిండి మూలలంక గ్రామానికి చెందిన కేతా సాయిబాబా (24), క్లీనర్ పుట్టా నాగరాజు (19) బొలెరో వాహనంలో చేపల లోడుతో బయలుదేరారు. హైదరాబాద్ నుంచి లారీ కర్ణాటకకు వెళ్తోంది. తెట్టు వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో బొలెరో వాహనం తప్పించబోయి ఢీకొట్టింది. దీంతో సాయిబాబా, నాగరాజు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం కందుకూరు ఆస్పత్రికి తరలించారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలతో..
● వ్యక్తి ఆత్మహత్య
ఆత్మకూరు: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాళెంలో చోటు చేసుకుంది. ఎస్సై బి.సాయిప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బీసీకాలనీకి చెందిన జి.శ్రీకాంత్ (37) మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్యతో తరచూ గొడవ లు జరుగుతుండేవి. ఆమె ఇటీవల అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీకాంత్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఇన్‌చార్జి డీఆర్వోగా హుస్సేన్ సాహెబ్
నెల్లూరు(అర్బన్): జిల్లా రెవెన్యూ ఇన్‌చార్జి అధికారిగా తెలుగుగంగ స్పెషల్ కలెక్టర్ హుస్సేన్‌సాహెబ్‌ను నియమిస్తూ కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఆర్వోగా పనిచేస్తున్న ఉదయభాస్కర్‌రావును ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసింది. రెగ్యులర్ డీఆర్వోను నియమించేంత వరకు హుస్సేన్ సాహెబ్ ఇన్‌చార్జిగా కొనసాగుతారు.
నేడు ప్రజా సమస్యల
పరిష్కార వేదిక
నెల్లూరు రూరల్: ప్రతి సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిథిగా కొనసాగుతుందని కలెక్టరేట్ కార్యాలయ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలపై కలెక్టరేట్‌లో వినతిపత్రాలు అందించాలన్నారు.