
తనువు చాలించి.. కన్నీళ్లు మిగిల్చి..
● వేర్వేరు చోట్ల ఇద్దరి ఆత్మహత్య
నెల్లూరు సిటీ: యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రూరల్ మండలంలో చోటు చేసుకుంది. రూరల్ పోలీసుల కథనం మేరకు.. ఆమంచర్ల పంచాయతీ మట్టెంపాడుకు చెందిన వి.మణికంఠ (20) పెయింటింగ్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి తల్లిదండ్రులు లేరు. ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఎవరూ లేకపోవడం, అప్పుల పాలుకావడంతో కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం తన ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమీప బంధువు వెళ్లి చూసి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఒంటరితనం వేధించడంతో ఒకరు, వివిధ కారణాలతో మరొకరు మద్యానికి బానిసయ్యారు.
ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలు నెల్లూరు రూరల్ మండలంలో జరిగాయి. ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.
అల్లీపురంలో..
అల్లీపురంలోని టిడ్కో ఇంట్లో ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కొండాపురం మండలంలోని వరికుంట గ్రామానికి చెందిన దార్ల వెంకటేష్ (34)కు కొన్నినెలల క్రితం వివాహమైంది. భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. వెంకటేష్ తల్లిదండ్రులతో ఉంటూ వ్యసనాలకు బానిసయ్యాడు. స్థానికంగా గొడవలకు వెళ్తుండేవాడు. రెండో పెళ్లి కోసం కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చాడు. నెల్లూరు నగరంలోని బంధువుల ఇంట్లో ఉంటూ బేల్దారి పనులకు వెళ్లాలని తల్లిదండ్రులు నచ్చజెప్పి పంపారు. ఈ క్రమంలో బంధువులు తమకు అల్లీపురంలో టిడ్కో ఇల్లు ఉందని అక్కడికి వెళ్లి ఉండాలని అతడిని పంపారు. కొంత కాలంగా అక్కడే ఉంటున్న వెంకటేష్ భార్య వదిలేయడం, ఇంట్లో వాళ్లు రెండో పెళ్లి చేయకపోవడంతో మనస్తాపానికి గురై మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బంధువులు అతడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో టిడ్కో ఇంటికి వెళ్లారు. తలుపులు తట్టినా తెరవకపోవడంతో కిటికీలో నుంచి చూశారు. వెంకటేష్ చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే బంధువులు రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి తలుపులు పగులకొట్టి మృతదేహాన్ని దించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.