
లో గ్రేడ్ పొగాకును కొనుగోలు చేయండయ్యా..
కందుకూరు: పొగాకు మార్కెట్లో ఈ ఏడాది నెలకొన్న సంక్షోభంతో పూర్తిగా నష్టపోతున్నామని.. పండించిన పంటను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లో గ్రేడ్ పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయకపోతే తమ పరిస్థితి ఏమిటని నిలదీశారు. ఈ మేరకు పామూరు రోడ్డులోని రెండో వేలం కేంద్ర పరిధిలో పొగాకు వేలాన్ని అడ్డుకొని రైతులు ఆందోళనకు శనివారం దిగారు. వేలాన్ని నిలిపేసి.. రోడ్డుపైకి వచ్చి వాహనాలను అడ్డుకొని నిరసన చేపట్టారు. ఈ తరుణంలో పోలీసులు జోక్యం చేసుకొని రైతులకు సర్దిచెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఆపై రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. బోర్డు కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు అర్ధనగ్న ప్రదర్శన జరిపారు. అనంతరం సబ్ కలెక్టర్ శ్రీపూజకు వినతిపత్రాన్ని అందజేశారు. వేలం చివరి దశకు చేరుకుందని, అయినా బోర్డులో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరగడంలేదని ఆరోపించారు.
అదనపు భారం
రైతుల వద్ద లో గ్రేడ్ రకం పొగాకు ఉత్పత్తులే ప్రస్తుతం ఉన్నాయి. కిలోను ఇప్పటి వరకు రూ.160కు కొనుగోలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ ధరకూ కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ధరలు తగ్గించిచ్చేందుకు సిద్ధమైనా, కొనుగోలు చేయడంలేదని వాపోయారు. వేలం కేంద్రానికి తీసుకొచ్చిన బేళ్లను కొనుగోలు చేయకపోవడంతో తిరిగి ఇళ్లకు చేర్చుకోవాల్సి వస్తోందని, ఫలితంగా రవాణా చార్జీల రూపంలో అదనపు భారం పడుతోందని చెప్పారు. ఒకసారి వేలానికి తీసుకొచ్చి, తిరిగి ఇంటికి తీసుకెళ్లిన బేలులో దాదాపు 10 కిలోల పొగాకు వ్యత్యాసం కనిపిస్తోందని ఆరోపించారు. కొనుగోలు చేయకుండా తిప్పి పంపితే, తామేమీ చేసుకోవాలని, ఎక్కడ విక్రయించాలని నిలదీశారు. అధికారులు జోక్యం చేసుకొని లో గ్రేడ్ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చూడాలని డిమాండ్ చేశారు. క్వింటాల్ లో గ్రేడ్ రకం పొగాకును రూ.32 వేలకు గతేడాది కొనుగోలు చేసిన వ్యాపారులు, ఈ ఏడాది రూ 15 వేలకు కూడా కొనుగోలు చేయకపోవడమేమిటని ప్రశ్నించారు.
ఇరువర్గాలను ఒప్పించి..
వేలం కేంద్రానికి వచ్చిన బోర్డు రీజినల్ మేనేజర్ లక్ష్మణరావు.. అటు రైతులు, ఇటు వ్యాపారులతో చర్చలు జరిపారు. వేలం సాగేందుకు ఇరువర్గాలను ఒప్పించారు. అయినా లో గ్రేడ్ పొగాకును కొనుగోలు చేసేందుకు చాలా మంది వ్యాపారులు ముందుకు రాకపోవడం గమనార్హం. పొగాకు కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, చేతల్లో ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండో వేలం కేంద్రంలో
రైతుల ఆందోళన
అర్ధనగ్న ప్రదర్శన
సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత