
డాక్టర్ల సేవలకు సలాం
● కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు ● నేడు డాక్టర్స్ డే
నెల్లూరు(అర్బన్): అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఆపదలో ఉండే రోగులకు డాక్టర్లు ప్రాణాలు పోస్తున్నారు. ప్రమాదం జరిగి ప్రాణాపాయస్థితిలో ఉన్నా, ఒళ్లంతా కాలినా, పాము కరిచినా.. కొట్లాటలో కత్తులు దిగబడినా డాక్టర్లు వృత్తినే దైవంగా భావించి విసుగు, విరామం లేకుండా వైద్యం చేసి కాపాడుతున్నారు. తెల్లని చొక్కా ధరించి, చిరునవ్వుతో, నిబద్ధతతో, అంకితభావంతో వైద్యం చేస్తూ ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్‌ను దేవుడితో సమానంగా చూస్తారు. కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రోగులను కాపాడారు. ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీని డాక్టర్స్ డేగా జరుపుకొంటున్నారు. జిల్లాలో వైద్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం సంబరాలు నిర్వహిస్తారు.
రోగులకు సేవలందిస్తూ..
జిల్లాలో సుమారు 1,300 వరకు ఆస్పత్రులు, క్లినిక్‌లున్నాయి. వీటిలో 52 పీహెచ్‌సీలు, 28 అర్బన్ హెల్త్ సెంటర్లు, 10 సామాజిక ఆస్పత్రులు (సీహెచ్‌సీలు), ఆత్మకూరులో జిల్లా ఆస్పత్రి, కందుకూరు, కావలిలో ఏరియా ఆస్పత్రి, జిల్లా కేంద్రంలో సర్వజన ఆస్పత్రులున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో 2 వేల మంది డాక్టర్లు వైద్యం చేస్తున్నారు.
ఆరోగ్యం అందరి హక్కు
ప్రజలందరికీ ఆరోగ్యం హక్కుగా అందాలని డాక్టర్లు భావిస్తున్నారు. కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటళ్లను మినహాయిస్తే ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ప్రభుత్వ డాక్టర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. దేశంలో 70 శాతం మంది పేద, మధ్యతరగతి ప్రజలే ఉన్నారు. వీరికి వైద్యం అందించడంలో విశేష కృషి చేస్తున్నారు. డెంగీ, డయేరియా, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలినప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోనే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందిస్తున్నారు.
వైద్యం చేసి..
కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు తమ గేట్లు మూసేసుకున్నాయి. పలు హాస్పిటళ్లు వైద్యం చేసినా రోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేసి వారి నాడి పట్టిన పాపాన కూడా పోలేదు. అలాంటి తరుణంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యసేవలందించిన ఘనత ప్రభుత్వ వైద్యులకే దక్కుతుంది. జిల్లాలో 2 లక్షల మందికిపైగా కోవిడ్ బారిన పడగా వారికి వైద్యం చేస్తూ ఐదుగురు వైద్యులు తమ ప్రాణాలు కోల్పోయారు.