
జీతాల్లేవు.. క్రీడల్లో శిక్షణెలా..?
రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా మారుస్తామని సీఎం చంద్రబాబు తరచూ ఊదరగొడుతుంటారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే విస్మయం కలగకమానదు. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసే వారికి నెలల తరబడి జీతాలను చెల్లించకపోవడంతో వారి ఆకలికేకలు తీవ్రమవుతున్నాయి. వీటిని సక్రమంగా అందించకపోవడంతో స్టేడియాల్లో క్రీడాకారులకు ఎలా తర్ఫీదునిస్తారో అంతుచిక్కడంలేదు. సమస్యలపై రాష్ట్ర ఉన్నతాధికారులకు లేఖలు పంపినా, ఏ మాత్రం చలనం ఉండటంలేదు.
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో దాదాపు 26 మంది కోచ్‌లు, గ్రౌండ్స్‌మెన్, స్వీపర్లు, సెక్రటరీలు, వాచ్‌మెన్లకు ఏడాదిగా జీతాలు రావడంలేదు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వీరు తమ వెతలపై రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థకు విన్నవించినా ప్రయోజనం కరువవుతోంది. ఏటా ఇదే పరిస్థితి ఏర్పడినా ఇటీవలి కాలంలో వీరు పరిస్థితి దయనీయంగా మారింది. ఫలితంగా ఇంటి బాడుగలు చెల్లించలేక, కుటుంబాన్ని పోషించలేక నానా అగచాట్లు పడుతున్నారు.
లేఖ రాసినా స్పందనేదీ..?
వీరికి జీతాలు రావడంలేదనే అంశాన్ని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్‌కు కలెక్టర్ ఆనంద్ మార్చిలో లేఖ రాసినా, స్పందన నేటికీ కొరవడింది. నెల్లూరుతో పాటు ఆరు జిల్లాల మినహా మిగిలిన అన్ని చోట్ల వేతనాలు సక్రమంగానే అందుతున్నాయి. ఇక్కడే ఈ పరిస్థితి ఎందుకని ఎవరైనా ప్రశ్నిస్తే, సరైన సమాధానం కరువవుతోంది. వాస్తవానికి కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో పనిచేస్తున్న కోచ్‌లకు రూ.21,500.. జూనియర్ అసిస్టెంట్‌కు రూ.20 వేలు.. ఆఫీస్‌లో పనిచేస్తున్న వారికి రూ.18,500.. స్వీపర్లు, గ్రౌండ్ మార్కర్లకు రూ.15 వేల మేర జీతాలు రావాల్సి ఉంది.
అనారోగ్యానికి గురైనా అదే తీరు..
జీవరత్నం అనే ఉద్యోగి నెల కింద బ్రెయిన్ ట్యూమర్‌కు గురై కాళ్లు, చేతులతో పాటు మాట పడిపోయింది. సాయం చేయాలని మేలో లేఖలు పంపినా, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ పట్టించుకోవడంలేదు. అతని పరిస్థితిని గమనించి ఆర్థిక సాయాన్ని సాఫ్ట్‌బాల్ జిల్లా అసోసియేషన్, ఖోఖో, కబడ్డీ తదితర క్రీడాకారులతో పాటు నెల్లూరు డీఎస్డీఓ అందజేశారు. ఇప్పటికై నా సమస్యను పరిష్కరించి తమకు జీతాలను చెల్లించాలని వీరు కోరుతున్నారు.
వేతనాలు రాక స్టేడియంలో
సిబ్బంది ఆకలికేకలు
లేఖలు రాసినా రాష్ట్ర క్రీడాప్రాధికార
సంస్థ నుంచి స్పందన కరువు
అనారోగ్యానికి గురైనా కనికరం చూపని సర్కార్
ఏడాదిగా ఇదే దుస్థితి
ఉన్నతాధికారులకు తెలియజేశాం
జీతాలు రాని విషయాన్ని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఉన్నతాధికారులకు తెలియజేశాం. కలెక్టర్ ద్వారా లేఖలు పంపాం. సమస్య త్వరలో పరిష్కారమవుతుందని భావిస్తున్నాం.
– యతిరాజ్, డీఎస్డీఓ