
పంచాయతీ కార్యదర్శుల ఆందోళన బాట
నెల్లూరు (పొగతోట) : సమస్యల సాధన కోసం పంచాయతీ కార్యదర్శులు కదం తొక్కారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం డీపీఓ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగారు. భారీ సంఖ్యలో హాజరైన పంచాయతీ కార్యదర్శులు, మండుటెండను సైతం లెక్క చేయకుండా డీపీఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. డీపీఓ, కలెక్టరేట్ అధికారులకు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య నాయకులు చల్లా ప్రసాద్‌రెడ్డి, ఓ లెనిన్, శ్రీనివాసులురెడ్డి, శివకుమార్ మాట్లాడుతూ పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీ కార్యదర్శులను అవహేళన చేస్తూ మనో భావాలు దెబ్బతినేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 6 గంటలకే ఇంటింటి చెత్త సేకరణ చేసేటప్పుడు ఫొటోలు పెట్టి అప్‌లోడ్ చేయాలంటూ కార్యదర్శుల స్థాయిని తగ్గిస్తూ మాట్లాడారని వాపోయారు. ఇప్పటికే తమపై పని ఒత్తిడి అధికంగా ఉందన్నారు. ఏ శాఖకు లేని ఐవీఆర్‌ఎస్ కాల్స్ పంచాయతీశాఖకు వద్దంటూ విజ్ఞప్తి చేశారు. పంచాయతీ కార్యదర్శుల వల్లే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి గిన్సిస్ రికార్డు నమోదు అయిందన్నారు. యోగాంధ్ర విజయవంతంలో పంచాయతీ కార్యదర్శులు రాత్రి, పగలు శ్రమించారని గుర్తు చేశారు. కార్యదర్శులకు సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల పంచాయతీల్లో అన్ని రకాల సర్వేలు, స్వర్ణ పంచాయతీ పనులు, ఇంటి పన్ను వసూళ్లు, పీఆర్ 1 యాప్, గ్రామ సచివాలయాల సర్వేలు, పీజీఆర్‌ఎస్ పనులు, గ్రామ సభలు, పంచాయతీ సమావేశాలు, సంక్షేమ పథకాల అమలు, ఎన్నికల విధులు, ప్రొటోకాల్ విధులు తదితర పనులతో పని ఒత్తిడి అధికంగా ఉందన్నారు. దీంతోపాటు నిత్యం వెబ్ కాన్ఫరెన్స్‌లు, గూగుల్ మీట్‌లు, టెలీకాన్ఫరెన్స్‌లతో ఒత్తిడితో నలిగిపోతున్నామన్నారు. ప్రతిది పంచాయతీ కార్యదర్శులకు అప్పగించడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై కార్యదర్శులు వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. కుటుంబ సంక్షేమాన్ని కూడా పట్టించుకోకుండా పనులపై 24 గంటలు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య నాయకులు పురిణి శ్రీనివాసులు, ఆర్.శివకుమార్, ఎస్‌కే ఇంతియాజ్, వహీదా అధిక సంఖ్యలో పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
పని ఒత్తిడి తగ్గించాలి
పంచాయతీ కార్యదర్శులు పని ఒత్తిడితో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సంక్షేమ పథకాలు, సర్వేలు, ప్రతిదీ పంచాయతీ సెక్రటరీలకే అప్పగిస్తున్నారు. పండ్లు కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు పంచాయతీ కార్యదర్శులకే ప్రతి పనిని అప్పగిస్తున్నారు. పంచాయతీ రాష్ట్ర ఉన్నతాధికారులు కార్యదర్శులను కించపరిచేలా మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శుల మనోభావాలు దెబ్బతినేలా అధికారుల మాట తీరు ఉంది. పని ఒత్తిడి తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
– చల్లా ప్రసాద్‌రెడ్డి, కార్యదర్శుల జిల్లా నాయకుడు
అనారోగ్యాల పాలవుతున్నాం
పంచాయతీ కార్యదర్శులపై తీవ్రమైన పని ఒత్తిడి ఉంది. పని ఒత్తిడి కారణంగా అనారోగ్యాల పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. పంచాయతీ కార్యదర్శులకు ఐవీఆర్‌ఎస్ కాల్స్ దూరంగా ఉంచాలి. కార్యదర్శుల సంక్షేమం కోసం అధికారులు, ప్రభుత్వం కృషి చేయాలి.
– ఓ లెనిన్, కార్యదర్శుల జిల్లా నాయకుడు
డీపీఓ, జిల్లా పరిషత్ కార్యాలయం, కలెక్టరేట్ ఎదుట ధర్నాలు
పని ఒత్తిడి తగ్గించకుంటే సమ్మెకు దిగుతామంటూ హెచ్చరిక
సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రాలు

పంచాయతీ కార్యదర్శుల ఆందోళన బాట

పంచాయతీ కార్యదర్శుల ఆందోళన బాట