
ధర్నాలు చేసి.. సమస్యల్ని నినదించి..
నెల్లూరు రూరల్: కూటమి ప్రభుత్వంపై వివిధ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమస్యల పరిష్కారం కోసం పోరు బాట పట్టాయి. సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీ యూనియన్, విద్యార్థి సంఘం, కార్పొరేషన్ ఎదుట ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ధర్నాలు చేశారు.
‘తల్లికి వందనం’ అమలు చేయాలంటూ..
సమగ్ర శిశు అభివృద్ధి సేవ పథకం కింద గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ అంగన్‌వాడీ వర్కర్లకు తల్లికి వందనం పథకం అమలు చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ అనుబంధ యూనియన్ వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు ఇవ్వాలని, సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగం అనే పదం తొలగించాలని డిమాండ్ చేశారు. గౌరవ వేతనంతో ఉపాధి పొందుతున్నారని, సంక్షేమ పథకాలు లేకపోతే బతకడం కష్టమన్నారు. ఐదు సంవత్సరాల్లోపు పిల్లలందరూ అంగన్‌వాడీ సెంటర్‌లోనే ఉండేలా జీఓ ఇవ్వాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ రద్దు చేయాలని కోరారు. మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలన్నారు. ప్రతినెలా 10వ తేదీ నాటికి లబ్ధిదారులకు ఇచ్చే అన్ని రకాల సరుకులు సకాలంలో సెంటర్‌కు చేర్చాలని కోరారు. మెనూ చార్జీలు పెంచాలని కోరారు.
హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలి
నెల్లూరు వెంకటేశ్వరపురం పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో సమస్యలున్నాయని, అధికారులు చొరవ తీసుకుని పరిష్కరించాలని పీడీఎస్‌యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సునీల్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి విద్యార్థులు ప్రభుత్వ పాలిటెక్నిక్ హాస్టల్లో ఉంటున్నారని, మౌలిక వసతుల్లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బురద నీరు వస్తోందని, పిల్లలు స్నానం కూడా చేయలేకపోతున్నట్లు చెప్పారు. ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలన్నారు. కరెంట్ బిల్లు ప్రభుత్వమే కట్టేలా చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నేతలు అక్రమ్, తాహిర్ తదితరులు పాల్గొన్నారు.

ధర్నాలు చేసి.. సమస్యల్ని నినదించి..