
వ్యక్తి అనుమానాస్పద మృతి
నెల్లూరు(క్రైమ్): ఓ వ్యక్తి తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కిసాన్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ లాబాన్ (34) కిసాన్‌నగర్‌లోని మూడోవీధిలో కుమార్తె పేరిట ల్యాబ్‌ను నిర్వహిస్తూ కుటుంబంతో కలిసి అక్కడే ఉంటున్నారు. ఎప్పటిలాగే భార్య సంగీత, పిల్లలు లాస్య, రిత్విక్‌ను ఎన్టీఆర్‌నగర్‌లోని తన తల్లిదండ్రుల ఇంట్లో శనివారం వదిలిపెట్టి ఇంటికొచ్చారు. రాత్రి 10.30కు భార్యతో వీడియోకాల్ మాట్లాడారు. చర్చికి వెళ్లేందుకు లాబాన్ ఆదివారం ఉదయం రాకపోవడంతో భార్య ఫోన్ చేశారు. పలుమార్లు యత్నించినా ప్రయోజనం లేకపోవడంతో పక్కింటివారికి ఫోన్ చేసి విషయాన్ని సంగీత తెలియజేశారు. వారు వెళ్లగా, ముందు తలుపు మూసి.. వెనుక తలుపు తెరిచి ఉంది. లోపలికెళ్లిచూడగా బెడ్‌పై లాబాన్ ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉన్నారు. మొహానికి ప్లాస్టిక్ కవర్‌ను చుట్టి షూ లేస్‌తో కట్టి ఉండటాన్ని గమనించి.. సంగీతకు విషయాన్ని తెలియజేశారు. హుటాహుటిన చేరుకున్న ఆమె తన భర్త మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నవాబుపేట ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. వేలిముద్రలను క్లూస్‌టీమ్ సేకరించింది. పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
విభిన్న కోణాల్లో దర్యాప్తు
లాబాన్ మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. మృతి చెందిన తీరును బట్టి ఎవరైనా ఓ పథకం ప్రకారమే ఊపిరాడకుండా చేసి హతమార్చారాననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆయనకు ఎవరితోనైనా విభేదాలు.. పాతకక్షలున్నాయా అనే కోణాల్లో సైతం విచారణ జరుపుతున్నారు.