
రేషన్ బియ్యం తరలింపుపై విచారణ
కొండాపురం: మండలంలోని మర్రిగుంట మీదుగా రేషన్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని గ్రామస్తులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చిన విషయం తెల్సిందే. ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికారులు ఎలాంటి విచారణ చేయలేదు. అయితే పోలీసులు డీలర్ సురేష్, వాహన డ్రైవర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కొండాపురం తహసీల్దార్ కోటేశ్వరరావు గురువారం గ్రామంలో విచారణ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామానికి 5,150 రేషన్ కేజీల బియ్యం మంజూరు చేశామన్నారు. షాపులో తనిఖీలు చేయగా గ్రామస్తులందరూ వారి వేలిముద్రలు వేసి బియ్యం తీసుకున్నట్లు ఆన్‌లైన్‌లో నమోదైందన్నారు. షాపులో పరిశీలించగా గ్రామానికి కేటాయించిన బియ్యం లబ్ధిదారులకు అందజేశారని, మిగిలిన 25 కేజీల బియ్యం డీలర్ వద్ద స్టాక్ ఉన్నట్లు నిర్ధారించామన్నారు. ఇక్కడ అవకతవకలు జరగలేదని, అక్రమంగా తరలివెళ్లిన రేషన్ బియ్యం మర్రిగుంట షాపునకు సంబంధించినది కాదని తేల్చామన్నారు. ఆయనవెంట ఆర్‌ఐ బి.శ్రీనివాసులు, వీఆర్వో చెన్నకేశవులు ఉన్నారు.