
దివ్యాంగ ఉపాధ్యాయ బదిలీలపై స్టేటస్ కో
● రోజుకో మార్పుతో
గందరగోళంగా జాబితా
● లెక్కతేల్చలేక సతమతమవుతున్న
అధికారులు
● ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం
పోర్టల్ ప్రారంభం
● దివ్యాంగులకు సంబంధించి
హైకోర్టు స్టేటస్ కో జారీ
నెల్లూరు(టౌన్): టీచర్ల బదిలీలు షురూ కానున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తప్పనిసరిగా బదిలీ అయ్యే ఉపాధ్యాయులు, పోస్టులపై ఎంఈఓలు, సిబ్బంది కసరత్తు వేగవంతం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫర్ పోర్టల్‌ను బుధవారం ప్రారంభించారు. ఎనిమిది, ఐదేళ్ల సర్వీస్‌ను పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు ఇందులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రోజుకో మార్పు
బదిలీలు, పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు మార్పులు.. చేర్పులు చేస్తూ సిబ్బందిని గందరగోళంలోకి నెట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఖాళీ పోస్టులు, బదిలీ అయ్యే ఉపాధ్యాయ జాబితాపై ఎటూ తేల్చలేక తలలు పట్టుకుంటున్న సందర్భాలూ ఉన్నాయి.
డీఎస్సీ పోస్టులు ప్రశ్నార్థకం
డీఎస్సీలో ప్రకటించిన 556 మంది స్కూల్ అసిస్టెంట్లకు పోస్టింగ్‌లను ఎక్కడి నుంచి తీసుకొస్తారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. ఎంపీపీ, జెడ్పీ పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతుల ఉండవని చెప్తున్నారు. కేవలం మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న కొద్ది మంది ఎస్జీటీలకే ఉంటాయంటున్నారు. ఎస్జీటీలకు సైతం పోస్టింగ్‌ల వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తోంది.
పారదర్శకంగా బదిలీలు
ఉపాధ్యాయ బదిలీలను పారదర్శకంగా జరపనున్నాం. జిల్లాలో అన్ని ఉపాధ్యాయ ఖాళీలను ప్రదర్శిస్తాం, హెడ్‌మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్ల బదిలీలను ఆన్‌లైన్లో నిర్వహిస్తాం. ఎస్జీటీలకు సంబంధించిన మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాలో ఖాళీ పోస్టులు, ఐదేళ్లు పూ ర్తయిన హెడ్‌మాస్టర్లు, ఎనిమిదేళ్లను పూర్తి చేసుకున్న సెకండరీ గ్రేడ్ టీచర్ల వివరాలను సేకరించి జాబితాను రూపొందించాం. షెడ్యూల్ ప్రకారం బదిలీలను పూర్తి చేస్తాం.
– బాలాజీరావు, డీఈఓ
షెడ్యూల్ ఇలా..
ప్రక్రియ హెచ్‌ఎం స్కూల్ అసిస్టెంట్ ఎస్జీటీ
దరఖాస్తులు ఈ నెల 21, 22 ఈ నెల 21 నుంచి 24 ఈ నెల 21 నుంచి 27
ప్రొవిజనల్ సీనియార్టీ జాబితా 24 26, 27 31
అభ్యంతరాల స్వీకరణ 25 28 28 నుంచి జూన్ 1 వరకు
తుది సీనియార్టీ జాబితా 27 31 జూన్ 6
వెబ్ ఆప్షన్లు 28 జూన్ 1, 2 జూన్ 7 నుంచి 10
బదిలీ ఉత్తర్వులు 30 జూన్ 4 జూన్ 11
పదోన్నతులు, వెబ్ ఆప్షన్లు 30 జూన్ 5 –
పదోన్నతుల ఉత్తర్వులు 31 జూన్ 6 –
ఐదేళ్లు నిండిన హెచ్‌ఎంలు.. ఖాళీ పోస్టులు
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఐదేళ్ల సర్వీస్‌ను పూర్తి చేసిన హెడ్‌మాస్టర్లు 45 మంది ఉన్నారంటూ జాబితాను విడుదల చేశారు. ఎంపీపీ, జెడ్పీ పాఠశాలల్లో 36 మంది.. మున్సిపల్ పాఠశాలల్లో ఒకరు.. నెల్లూరు కార్పొరేషన్ పాఠశాలల్లో 8 మంది ఉన్నారు.
జిల్లాలో ఖాళీగా ఉన్న.. మృతిచెందిన.. రిటైరైన హెడ్‌మాసర్ల పోస్టులు ప్రభుత్వ – 4, ఎంపీపీ, జెడ్పీ 64.. కార్పొరేషన్ ఒకటి.. ఇలా 69గా ఉన్నాయని లెక్కలు చూపారు.
రీ అపోర్షన్ పోస్టులు ప్రభుత్వ – 25.. నెల్లూరు కార్పొరేషన్ పాఠశాలల్లో రెండు ఉన్నాయని తేల్చారు. జిల్లా వ్యాప్తంగా 141 హెడ్‌మాస్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు.
ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న
ఎస్‌ఏలు, ఎస్జీటీలు
ఎనిమిదేళ్లు సర్వీస్‌ను పూర్తి చేసుకున్న స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్ల వివరాలపై జిల్లా విద్యాశాఖ అధికారులు లెక్కలు తేల్చారు. స్కూల్ అసిస్టెంట్లు 1289 మంది.. సెకండరీ గ్రేడ్ టీచర్లు 1487 మంది ఉన్నారని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా 774 స్కూల్ అసిస్టెంట్లు, 572 సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టులు ఆయా పాఠశాలల్లో ఖాళీగా ఉన్నాయని జాబితాను విడుదల చేశారు. ఈ పోస్టులను బదిలీల్లో ఖాళీగా ఉన్నట్లు చూపించనున్నామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు.
జిల్లాలో 700 మందికిపైగా స్కూల్ అసిస్టెంట్లు మిగులు ఉన్నారని లెక్కలు తేల్చారు. వీరికి పోస్టింగ్ లేక రిజర్వ్‌లో పెట్టనున్నామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు.
ఆయా పాఠశాలల్లో పనిచేస్తూ ఎనిమిదేళ్ల సర్వీస్‌ను పూర్తి చేసుకున్న దివ్యాంగ ఉపాధ్యాయ బదిలీలపై రాష్ట్ర హైకోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులను జారీ చేసింది. నూరు శాతం అంధత్వం, 70 శాతానికిపైగా ఆర్థో సమస్యలున్న ఉపాధ్యాయులకు వారి అంగీకారం మేరకు బదిలీ ఆర్డర్లను గత ప్రభుత్వ హయాంలో ఇచ్చేవారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అలాంటి ఉపాధ్యాయులకు 50 శాతం బదిలీలను తప్పనిసరి చేసింది. ఈ తరుణంలో నూరు శాతం అంధత్వం ఉన్న ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో స్టేటస్ కో ఆర్డర్డ్‌ను జారీ చేశారు. అయితే రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అన్ని రకాల దివ్యాంగ ఉపాధ్యాయుల బదిలీలను నిలిపేశారని తెలిసింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్టేటస్ కో ఆర్డర్ ఎవరికి వర్తిస్తుందో తెలియజేయాలని కోరుతున్నారు.