
రేషన్ పంపిణీ పగ్గాలు డీలర్లకే
● ఎండీయూ ఆపరేటర్లకు బ్రేకులు
● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
నెల్లూరు (పొగతోట): రేషన్ కార్డుదారులకు ఇంటి వద్దకే సరుకుల పంపిణీకి గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) సేవలకు శాశ్వత ముగింపు పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి గతంలో మాదిరిగానే రేషన్ షాపుల వద్దే డీలర్లే సరుకులు పంపిణీ చేసే విధంగా పగ్గాలు కట్టబెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగిస్తారని ప్రచారం ఇప్పుడు నిజమైంది. అప్పట్లో ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం కొంత కాలంగా వాయిదా వేసింది. తాజాగా కార్డు దారులు ఇళ్ల వద్దకు వాహనాలు వచ్చి రేషన్ పంపిణీ చేసే వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. దీంతో రేషన్ డీలర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఇంటి వద్దకే ఎండీయూ ద్వారా రేషన్ సరుకులు పొందిన లబ్ధిదారులు ఇక నుంచి పడిగాపుల పంపిణీకి కూటమి ప్రభుత్వం తలుపులు తెరిచింది. రేషన్ డీలర్లు చౌకదుకాణం తీసిన సమయంలోనే వెళ్లి రేషన్ తీసుకోవాల్సి ఉంది. ప్రతి నెలా 1వ తేదీ నుంచి కార్డు దారులందరూ చౌక దుకాణాల వద్ద బారులు తీరి రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అవ్వా, తాత ఎవరైనా సరే రేషన్ షాపునకు వెళ్లాల్సిందే.
‘పది’ పరీక్షకు
77 మంది గైర్హాజరు
నెల్లూరు (టౌన్): పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 77 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలో 328 మంది విద్యార్థులకు 251 మంది హాజరయ్యారు.