
అక్రమాలు, అపచారాలు
నిబంధనల మేరకే
సేవాకమిటీ నియమించాం
దేవదాయశాఖ నిబంధనల మేరకు బ్రహ్మోత్సవాలకు సంబంధించి సేవా కమిటీ నియమించుకునే వెసులుబాటు ఉంది. అందులో భాగంగానే సేవాకమిటీని నియమించాం. బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత కమిటీ దానికదే రద్దవుతుంది. – అర్వభూమి
వెంకటశ్రీనివాసులురెడ్డి, ఈఓ, జొన్నవాడ
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: అత్యంత పవిత్రమైన జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో అపచారాలు జరుగుతున్నాయి. అవినీతి, అక్రమాలు పెచ్చు మీరుతున్నాయి. ఆలయానికి జిల్లాలో వందల ఎకరాలు భూములు, రూ.కోట్ల ఆస్తులు ఉన్నాయి. వేలం ద్వారా రాబడి అధికంగా వస్తోంది. అయినా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో ఎవరూ పట్టించుకోవడం లేదు. అదనపు వసూళ్లకు పాల్పడుతూ అమ్మవారి దర్శనానికి రావాలంటేనే భయపడేలా చేస్తున్నారు.
నిలువు దోపిడీ
ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను అడుగడుగునా నిలువు దోపిడీ చేస్తున్నారు. దేవదాయశాఖ నిర్దేశించిన టికెట్ ధరలకు సేవలు పొందాలంటే కుదరదు. ఆలయంలో ప్రవేశించనప్పటి నుంచి ప్రతి సేవకో రేటు ఫిక్స్ చేశారు. ఆపై అనధికారికంగా అదనపు వసూళ్లు చేస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారు. చెప్పుల స్టాండ్ ఉచితంగా నిర్వహించాల్సి ఉన్నా సందర్భాన్ని బట్టి జతకు రూ.5, రూ.10 వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి రసీదు ఇవ్వరు. తలనీలాలు సమర్పించేందుకు రూ.40 టికెట్ ధర చెల్లించాలి. అయితే సదరు తలనీలాలు తీసే వ్యక్తికి అదనంగా మరో రూ.30 లేదా అంతకంటే ఎక్కువ సమర్పించుకోవాల్సిందే. ఎందుకు చెల్లించాలని అడిగితే అసహ్యంగా దుర్భాషలాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇటువంటి ఘటనే వెలుగుచూసింది కొందరు భక్తులు డబ్బులు లేవని చెప్పినా ఫోన్‌పే, గూగుల్‌పే చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చేసేదేమీ లేక భక్తులు వారు అడిగినంత చెల్లిస్తున్నారు. ప్రత్యేక సందర్భాలు, పుట్టు వెంట్రుకలు, మొక్కులు అయితే సిబ్బంది పంట పండినట్లే వారు ఎంత డిమాండ్ చేస్తే అంత చెల్లించుకోవాల్సిందే. స్నానం చేయడానికి ఒక్కొక్కరికి రూ.10 చెల్లించాలి. గదుల్లో నీటి సౌకర్యం, డోర్లు మాత్రం సరిగా ఉండవు. ఒక గదిలో నీరు వస్తుంటే మరో గదిలో నీరు రాదు. పరిశుభ్రత దారుణంగా ఉంది. దీనికితోడు బిహార్‌కు చెందని ఓ వ్యక్తి అక్కడ భక్తుల నుంచి నగదు వసూలు చేస్తున్నాడు. అతనికి తెలుగురాదు. దీంతో భక్తులు అతనికి చెప్పేది అర్థంకాక అసహనం వ్యక్తం చేస్తున్నారు. శీఘ్రదర్శనం పేరిట రూ.50, ప్రత్యేక దర్శనం పేరిట రూ.25 వసూలు చేస్తున్నారు. ఇవికూడా భక్తులకు అదనపు భారంగా మారాయి. 80 గ్రాముల లడ్డూ రూ.15, 400 గ్రాముల లడ్డూ రూ.100కు విక్రయిస్తున్నారు. ఒక భక్తుడు అమ్మవారి దర్శనానికి వెళ్లి బయటకు రావాలంటే సుమారుగా రూ. 300 నుంచి రూ.400 ఖర్చు పెట్టాల్సిందే.
కొత్తగా సేవా కమిటీ ఏర్పాటు
దేవదాయశాఖ నిబంధనల మేరకు ఆ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలకు ధర్మకర్తల మండలి ఉంటుంది. జొన్నవాడ ఆలయంలో కూడా ధర్మకర్తల మండలి ఉంది. మావులూరు శ్రీనివాసులురెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధర్మకర్తల మండలిని ఉద్దేశ పూర్వకంగానే నిర్వీర్యం చేశారు. ఈ నెల 17వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో సేవా కమిటీ పేరుతో 12 మంది సభ్యులను నియమించారు. ధర్మకర్తల మండలి ఉండగా కమిటీ ఎందుకు నియమించారో ఎవరికీ అంతుపట్టని. గతంలో ఇలాంటి సంప్రదాయం ఎప్పుడూ లేదు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకే కమిటీని నియమించినట్లు తెలుస్తోంది. ధర్మకర్తల మండలి ఉండగా సేవా కమిటీ పేరుతో టీడీపీకి చెందిన వ్యక్తులను కమిటీలో నియమించడం నిధులు మింగేందుకేనని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొరవడిన పర్యవేక్షణ
ఆలయంలో ఏం జరుగుతుందో నిత్యం పర్యవేక్షించాల్సిన ఈఓ ఇవేవీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అదనపు వసూళ్లకు పాల్పడే సిబ్బందిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడంలో తీవ్రంగా విఫలమయ్యారు. ఆలయానికి వచ్చే వీవీఐపీలు, వీఐపీల సేవలో నిమగ్నమై సామాన్యులను పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాత్రుళ్లు నిద్ర చేసేందుకు వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు, భద్రతా విషయాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో కొందరు స్థానికంగా కొందరు ఆకతాయిలు మహిళా భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయ నిర్వహణ ఏ మాత్రం బాగలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ఘటనలు
జిల్లాలోని పవిత్ర పినాకినీ తీరంలో బుచ్చిరెడ్డిపాళెం మండలంలో మల్లికార్జున సమేత జొన్నవాడ కామాక్షితాయి శక్తి పీఠానికి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడికి రాష్ట్రంలో ఇతర జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. నిత్యం భక్తులతో ఆలయం రద్దీగా ఉంటుంది. రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది. అయితే నిర్వహణ అంతంత మాత్రంగా ఉంది. ప్రతి సేవకు దేవదాయశాఖ నిర్దేశించిన టికెట్ ధరలు చెల్లించినా.. అనధికారికంగా అదనపు వసూళ్లు చేస్తున్నారు. అక్రమాలు, అపచారాలతో ఆలయ ప్రతిష్టను దిగజార్చుతున్నారు.
జొన్నవాడ కామాక్షితాయి
ఆలయంలో రాబంధుల తిష్ట
ప్రతీదానికో రేటు, అదనపు వసూళ్లు
భక్తులను దోచుకుంటున్న సిబ్బంది
కొత్తగా సేవా కమిటీ ఎందుకు?
ఆలయ నిధులు మింగేందుకేనా!
అత్యంత పవిత్రమైన క్షేత్రంలో నిద్ర చేసే భక్తులు తమ దుస్తులను ఉచికి ఏకంగా ఆలయ ఆవరణలోని క్యూలైన్లలో ఆరవేసిన ఘటన ఇటీవల వెలుగు చూసింది. కళ్ల ముందు ఇలాంటి అపచారాలు కనిపిస్తున్నా ఆలయ సిబ్బంది కానీ, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై భక్తులు మండిపడ్డారు. అదే రోజు దర్శనానికి వచ్చిన భక్తులపై మతిస్థిమితం లేని వ్యక్తి దాడికి ప్రయత్నంచడంతో కలకలం రేగింది. ఆలయ పరిసరాల్లోనే మద్యపానంతోపాటు మాంసాహారం భుజించడం వంటివి కూడా జరుగుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆలయ ఈఓ అర్వభూమి వెంకట శ్రీనివాసులురెడ్డిని ప్రశ్నించగా తనకు తెలియదని, సిబ్బందిని అడిగి తెలుసుకుంటానని చెప్పడం చూస్తే.. ఈఓకు ఆలయంలో ఏం జరుగుతోందో కూడా తెలియడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

అక్రమాలు, అపచారాలు

అక్రమాలు, అపచారాలు

అక్రమాలు, అపచారాలు