
మీరైనా దయ చూపండి సారూ..
నెల్లూరు(క్రైమ్): ‘క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. మీరైనా దయ చూపండి సారూ’ అంటూ పలువురు ఎస్పీ జి.కృష్ణకాంత్‌ను కోరారు. సోమవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 101 మంది విచ్చేసి తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీకి అందజేశారు. వాటిని పరిశీలించిన ఆయన చట్టపరిధిలోని వాటిని సత్వరమే పరిష్కరించాలని ఆయా ప్రాంతాల పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌బీ, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీలు ఎ.శ్రీనివాసరావు, చెంచు రామారావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్‌బీ – 2 ఇన్‌స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● నా తండ్రిని 2020లో శ్రీనివాసులు, మరికొందరు హత్య చేశారు. ఆ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. నిందితులు, వారి కుటుంబ సభ్యులు రాజీపడాలని, లేకుంటే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. రక్షణ కల్పించాలని ఇందుకూరుపేటకు చెందిన ఓ వ్యక్తి కోరాడు.
● బెంగళూరుకు చెందిన ఐజాక్, నిశాంత్‌లు సోలార్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేస్తామని నమ్మబలికారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నాకు తెలిసిన వారి నుంచి రూ.60 లక్షలు వసూలు చేసిచ్చాను. వారు ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం లేదు. నగదు ఇవ్వడం లేదని నెల్లూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
● నా కుమారుడు గతనెల 12వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దీనిపై లోతైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నగరానికి చెందిన ఓ వ్యక్తి వినతిపత్రం ఇచ్చాడు.
● నేను, భానుప్రకాష్ ప్రేమ వివాహం చేసుకున్నాం. కులాలు వేరుకావడంతో నా కుటుంబ సభ్యులు ఇబ్బందులు పెడుతున్నారు. మాకు రక్షణ కల్పించాలని ఇందుకూరుపేట మండలానికి చెందిన ఓ యువతి కోరింది.
ఎస్పీకి వినతుల అందజేత