
దోషులు ఎంతటివారైనా వదలొద్దు
● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని ఇస్కపాళెం గ్రామ పంచాయతీ పరిధిలో పోలినాయుడుచెరువు ముస్లిం కాలనీకి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త షేక్ రఫీని దారుణంగా హత్య చేసిన నిందితులు ఎంతటివారైనా వదలొద్దని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు రఫీ హత్యలో ప్రమేయం ఉందని అక్కడి వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నారు. వారిని కూడా అరెస్ట్ చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. హత్యకు కారకులైన రంతుల్లా, ఖాదర్‌బాషా, ఆరిఫ్, పఠాన్ ఖాదర్‌బాషా, యాసిన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారన్నారు. వారు ఇక్కడ స్థిరపడి హత్యలు చేయడం దారుణమన్నారు. జిల్లాలో జరిగిన హత్యలను పరిశీలిస్తే శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతోందన్నారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ ఘటనపై స్పందించి నిష్పాక్షిక విచారణ జరిపించాలన్నారు. ఈ విషయాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పార్టీ పరంగా ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.