
డిమాండ్లు తీర్చే వరకు సమ్మెలోనే..
● స్పష్టం చేసిన సీహెచ్‌ఓ అసోసియేషన్ నాయకులు
నెల్లూరు(అర్బన్): తమ డిమాండ్లు నెరవేర్చేంతవరకు విధులు బహిష్కరించి సమ్మె కొనసాగిస్తామని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భానుమహేష్ తెలిపారు. తమను రెగ్యులర్ చేయాలని, ఫిక్స్‌డ్ జీతం ఇవ్వాలని, ఆయుష్మాన్ భారత్ భవనాల అద్దె చెల్లించాలని, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా తమకు 23 శాతం వేతనాలు పెంచాలని కోరుతూ డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద సీహెచ్‌ఓలు చేస్తున్న ఆందోళనలు శనివారం ఆరో రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా భానుమహేష్ మాట్లాడుతూ తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. తమ డిమాండ్లపై చర్చించి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. అప్పటి వరకు సమ్మె కొనసాగించి తీరుతామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి రెబకా, జిల్లా సమన్వయకర్త ఆదిల్, కార్యనిర్వాహక సభ్యులు మాబ్‌జాని, సుమాంజలి, పలువురు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.