
పొగాకు రైతుల పొట్టకొట్టొద్దు
కందుకూరు: ‘రూ.లక్షలు ఖర్చు చేసి పండించిన పొగాకు పంటకు సరైన ధర రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి వేలంలో ధరలు పెంచకపోవడం అన్యాయం. మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం దారుణం. రైతుల పొట్టకొట్టొద్దు’ అని వైఎస్సార్‌సీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్ అన్నారు. పామూరు రోడ్డులోని రెండో వేలం కేంద్రంలో పొగాకు వేలాన్ని పార్టీ నాయకులు, రైతులతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. వేలం కేంద్రం నిర్వహణాధికారి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది పొగాకు మార్కెట్ ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అకాలవర్షాల వల్ల నార్లు దెబ్బతిని రెండోసారి వేయాల్సి వచ్చిందన్నారు. బ్యారన్, పొలాల కౌలు రేట్లు పెరిగాయన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మార్కెట్ ప్రకారం లోగ్రేడ్ బేళ్లను వ్యాపారులు కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ ఇలాగే ఉంటే ప్రతి రైతులకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల నష్టం వచ్చే ప్రమాదం ఉందన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష ధోరణి
చంద్రబాబును నమ్మి ఓట్లు వేసిన పాపానికి పొగాకు రైతులు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మధుసూదన్ యాదవ్ చెప్పారు. ఒక్క పొగాకు రైతులకే కాకుండా, మిర్చి, ధాన్యం, పసువు వంటి ఇతర పంటలు కూడా గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వ్యాపారుల మధ్య పోటీ పెరిగితేనే ధరలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. గతేడాది రూ.36 వేల వరకు పలికిన క్వింటా పొగాకుకు ఇప్పుడు రూ.25 వేలు కూడా రావడం లేదని ఇంత వ్యత్యాసం ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. రైతులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. పొగాకు రైతుల పరిస్థితిని ఇప్పటికే పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ధరల్లో మార్పు రాకపోతే జగన్‌మోహన్‌రెడ్డి రైతుల తరఫున పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నలమోతు చంద్రమౌళి, మండలాధ్యక్షుడు గోగినేని రామాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల కొండయ్య, అధికార ప్రతినిధి ముప్పవరపు కిశోర్, జిల్లా కార్యదర్శి చీమల వెంకటరాజా, బూత్ కమిటీ రాష్ట్ర నేత గణేశం గంగిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ, పార్టీ మండలాల అధ్యక్షులు ఈదర రమేష్, అనుమోలు లక్ష్మీనరశింహం, నోటి వెంకటేశ్వరరెడ్డి, నన్నం పోతురాజు, ఎంపీపీ పెన్నా కృష్ణయ్య, మేధావుల సంఘం అధ్యక్షుడు రావులకొల్లు బ్రహ్మానందం, కల్చరల్ వింగ్ అధ్యక్షుడు కంపరాజు సాంబశివరాజు, ఐటీ వింగ్ అధ్యక్షుడు పి.అమరనాథ్‌రెడ్డి తదితరులు తదితరులు పాల్గొన్నారు.
మద్దతు ధర కల్పించి ఆదుకోవాలి
రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ
నియోజకవర్గ ఇన్‌చార్జి
బుర్రా మధుసూదన్ యాదవ్