
జీజీహెచ్‌లో ఆరుగురు పారిశుధ్య సిబ్బందిపై చర్యలు
నెల్లూరు(అర్బన్): రోగుల సహాయకులపై అనుచితంగా ప్రవరిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆరుగురు పారిశుధ్య సిబ్బందిపై నగరంలోని సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్ చర్యలు తీసుకున్నారు. శనివారం ఐపీ భవనంలో రెండో అంతస్తులో అడ్మిషన్‌లో ఉన్న పెంచలయ్య అనే రోగి కుటుంబ సభ్యురాలు విజయలక్ష్మి బాత్‌రూంలు సరిగా లేవని అక్కడ పనిచేస్తున్న రేవతికి తెలిపింది. ఈ క్రమంలో వాదనలు చోటు చేసుకున్నాయి. రెండో రోజు ఉదయం ఆస్పత్రి గేటు వద్ద రోగి కుటుంబ సభ్యురాలు విజయలక్ష్మిని పలువురు పారిశుధ్య కార్మికులు చుట్టుముట్టారు. ఈ విషయమై సోమవారం పెద్దాసుపత్రిలో సిబ్బంది దాష్టీకాలు శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో విజయలక్ష్మి సూపరింటెండెంట్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ విషయంతో పాటు ఆస్పత్రిలో తరచూ చోటు చేసుకుంటున్న ఇలాంటి మరికొన్ని విషయాలు పరిగణనలోనికి తీసుకున్న సూపరింటెండెంట్ మంగళవారం అందుకు కారకులైన పారిశుధ్య సిబ్బంది రేవతి, ధనమ్మ, బీబీజాన్, శైలజ, అమల, యాలమ్మలను వారం రోజుల పాటు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కూడా సిబ్బంది ఇచ్చే వివరణ బట్టి వారికి విధులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.

జీజీహెచ్‌లో ఆరుగురు పారిశుధ్య సిబ్బందిపై చర్యలు