రైతుల్ని దోచేస్తున్న దళారులు, మిల్లర్లు | - | Sakshi
Sakshi News home page

రైతుల్ని దోచేస్తున్న దళారులు, మిల్లర్లు

Mar 19 2025 12:05 AM | Updated on Mar 19 2025 12:05 AM

రైతుల్ని దోచేస్తున్న దళారులు, మిల్లర్లు

రైతుల్ని దోచేస్తున్న దళారులు, మిల్లర్లు

ముత్తుకూరు: కూటమి ప్రభుత్వంలో అటు మిల్లర్లు, ఇటు దళారులు రైతుల్ని దోచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. మండలంలోని డమ్మాయపాళెంలో మంగళవారం వరి ధాన్యం రాసులను పరిశీలించారు. రైతులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో పుట్టి (850 కిలోలు) ధాన్యాన్ని రైతులు రూ.25,000లకు అమ్మకం చేసుకోగా, కూటమి ప్రభుత్వంలో రూ.15,000లకు పడిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.40,000 నష్టపోతున్నారన్నారు. వరి కోతలు ముమ్మరమైతే ధరలు మరింత దిగజారే ప్రమాదం ఉందన్నారు. రైతులు ఈ స్థాయిలో నష్టపోతుంటే.. కారణాలు అన్వేషించి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుందని దుయ్యబట్టారు. దీన్ని బట్టి రైతులపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తోందన్నారు. మిల్లర్లు పుట్టి ధాన్యానికి ధర ఇస్తూ రైతు నుంచి తరుగు పేరుతో అదనంగా 150 కిలోల ధాన్యాన్ని దోచేస్తున్నారని విమర్శించారు. పేరుకు 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే, ఒక్క చోట కూడా ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. జిల్లా అధికారుల ప్రకటనలకు, వాస్తవాలకు పొంతన లేదన్నారు. ఉత్తుత్తి ప్రకటనలు కట్టి పెట్టి క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు పరిశీలించి, సమస్యలు పరిష్కరించాలన్నారు.

సోమిరెడ్డికి కమీషన్లపైనే దృష్టి

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ముడుపులు, కమీషన్లు, వసూళ్లపై దృష్టి పెట్టారని, రైతుల కష్టాలు పట్టించుకునే స్థితిలో లేడని కాకాణి ఆగ్రహం వెలిబుచ్చారు. రైతుల పక్షాన ఉంటూ న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. పార్టీ కన్వీనర్‌ మెట్ట విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, నాయకులు దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి, పోచారెడ్డి చెంగారెడ్డి, సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి, సర్పంచ్‌ సన్నారెడ్డి హారతి, ఎంపీటీసీ సభ్యులు మూగ కీర్తి, పాముల శ్రీనివాసులు, దువ్వూరు కోదండరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అధికారుల ప్రకటనలకు..

వాస్తవాలకు పొంతనలేదు

మా ప్రభుత్వ హయాంలో

పుట్టి రూ.25 వేలు

కూటమి ప్రభుత్వంలో రూ.15 వేలు

మాజీ మంత్రి కాకాణి ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement