
టెస్టింగ్ స్టేషన్ ఏర్పాటుకు నిబంధనలు
రవాణా శాఖలో సేవలను పారదర్శకంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రైవేటు వ్యక్తులు, దళారులను ఆశ్రయించకుండా నేరుగా వాహనదారులు, వినియోగదారులే తమకు కావాల్సిన సేవలను వినియోగించుకునే వీలు కల్పించింది. ఇప్పటికే 83కు పైగా సేవలను ఆన్‌లైన్ ద్వారా అందజేస్తుండగా తాజాగా డ్రైవింగ్ లైసెన్స్‌ను పారదర్శకంగా ఇచ్చే విధంగా ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ నిర్మాణాన్ని ప్రారంభించారు. వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను జారీ చేసేందుకు కూడా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
నెల్లూరు (టౌన్): ప్రస్తుతం వాహనాల ఫిట్‌నెస్‌ను మాన్యువల్ పద్ధతిలో టెస్టింగ్ చేసి అధికారులు సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. వాహనం కండిషన్‌లో లేకున్నా డబ్బులు ముట్టజెప్పితే చాలు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ చేతిలోకి వస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ద్వారా వాహనం కండిషన్‌గా ఉంటేనే సర్టిఫికెట్ అందజేసే పరిస్థితి ఉంది. వాహన ఫిట్‌నెస్‌ను వీడియో కెమెరాలు, సెన్సార్లు పరీక్షించిన తరువాతే సర్టిఫికెట్‌ను అందజేసే పరిస్థి తి ఉంది. టెస్టింగ్ స్టేషన్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
రోజుకు 100కు పైగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీ
జిల్లా పరిధిలో నెల్లూరు, ఆత్మకూరు, కావలి, కందుకూరు ప్రాంతాల్లో రవాణాశాఖ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2.5 లక్షలకు పైగా రవాణా వాహనాలు ఉన్నాయి. వీటిల్లో ట్రావెల్స్, టూరిస్టు బస్సులు, లారీలు, ఆటోలు, మ్యాక్సీక్యాబ్, మోటారు క్యాబ్ తదితర వాహనాలు ఉన్నాయి. రవాణా వాహనాలు ప్రతి ఏడాది ఆయా ప్రాంతాల్లోని రవాణా అధికారుల ద్వారా ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను పొందాల్సి ఉంటుంది. కొత్త వాహనాలైతే రెండేళ్ల వరకు ఫిట్‌నెస్ ఉంటుంది. మాన్యువల్ ద్వారా ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను జారీ చేస్తుండటంతో అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. వాహనం కండిషన్‌లో లేకున్నా రవాణా అధికారులకు డబ్బులు ముట్టజెప్పితే ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను జారీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆరు బిడ్లు దాఖలు
ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ఏర్పాటుకు మొత్తం 6 మంది ఆన్‌లైన్‌లో బిడ్‌లు దాఖలు చేశారు. గతనెలలో బిడ్‌లను ఓపెన్ చేశారు. బిడ్ దాఖలు చేసిన వ్యక్తులకు సంబంధించిన స్థలాన్ని తనిఖీ చేయడంతో పాటు పూర్తి వివరాలు సేకరించి పంపించాలని రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఉప రవాణా కమిషనర్ బి.చందర్ నేతృత్వంలో అధికారులు సంబంధిత వ్యక్తుల స్థలాన్ని తనిఖీ చేసి వివరాలు నివేదిక రూపంలో ఈనెల మొదటి వారంలో రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయానికి పంపించారు. ఈ వివరాలను పరిశీలించిన అనంతరం ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ఏర్పాటుకు సంబంధించి టెండరు దక్కించుకున్న ప్రైవేటు వ్యక్తికి బాధ్యతలను అప్పగించనున్నారు.
జిల్లా కేంద్రంలో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. టెస్టింగ్ స్టేషను ఏర్పాటును ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఇందుకు సంబంధించి నియమ, నిబంధనలను జారీ చేశారు. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌కు ఎకరం స్థలం ఉండాలని నిబంధన విధించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి 30 కిలోమీటర్లు పరిధిలో ఆ స్థలం ఉండాలి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి పక్కనే ఉండాలి. స్థలం పక్కన పవర్ స్టేషన్ గాని, హైటెన్షన్ వైర్లు గాని ఉండకూడదు. మెయిన్ రహదారి నుంచి స్థలానికి పోయే దారి కనీసం 7 మీటర్లు వెడల్పు ఉండాలి. టెస్టింగ్ స్టేషనులో సీసీ కెమెరాలు, వీడియో కెమెరాలు, సెన్సార్లు బిగించనున్నారు. వీటి ద్వారా నేరుగా వాహన కండిషన్‌ను తనిఖీ చేయనున్నారు. వాహనంలో ఏ చిన్న లోపం ఉన్నా వీటి ద్వారా బయటపడుతుంది. ఆ తరువాత ఆ లోపాన్ని సరిదిద్దిన తరువాత వాహన ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను జారీ చేయనున్నారు.
నెల్లూరులో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్
ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు
మాన్యువల్ టెస్ట్‌కు గుడ్‌బై
6 మంది బిడ్‌లు దాఖలు
త్వరలో టెండర్లు ఖరారు
పారదర్శకంగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు
ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ద్వారా పారదర్శకంగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నాం. వాహనానికి సంబంధించి పూర్తి కండిషన్‌ను సీసీ కెమెరాలు, సెన్సార్ల ద్వారా తనిఖీ చేస్తాం. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి ప్రైవేటు వ్యక్తులు ఎవరినీ ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. త్వరలో టెస్టింగ్ స్టేషను ఏర్పాటుకు సంబంధించి టెండర్లు ఖరారు చేయనున్నాం. అనంతరం పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటాం.
– బి.చందర్, డీటీసీ

ఫిట్‌నెస్‌కు వచ్చిన వాహనానికి సంబంధించి పత్రాలను పరిశీలిస్తున్న డీటీసీ చందర్

ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్