ధాన్య సిరికి కొనుగోలు భరోసా

ధాన్యాన్ని బస్తాలకు కడుతున్న దృశ్యం (ఫైల్‌) 
 - Sakshi

జిల్లాలో..

ఇప్పటివరకు ఏర్పాటు చేసిన

కొనుగోలు కేంద్రాలు – 124

దిగుబడి ఆధారంగా –175 వరకు పెంపు

సాగు అంచనా –

4.50 లక్షల ఎకరాల్లో

దిగుబడి అంచనా –

8.50 లక్షల మెట్రిక్‌ టన్నులు

నెల్లూరు(సెంట్రల్‌) : ధాన్య సిరిగా పేరుగాంచిన సింహపురి జిల్లాలో ఈ ఏడాదిలో ధాన్యం కొనుగోలుకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా వ్యవసాయ శాఖ అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. గత అనుభవాలను, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ధాన్యం సేకరణ చేసే విధంగా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దిగుబడి ఆధారంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో మరికొన్ని చొట్ల ఏర్పాట్లకు పక్కాప్రణాళిక సిద్ధం చేశారు.

సమృద్ధిగా వర్షాలు.. ముమ్మరంగా సాగు

జిల్లాలో వ్యవసాయానికి సంబంధించి రబీ సీజన్‌లో ఎక్కువగా ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. గత మూడు సంవత్సరాల నుంచి సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో పాటు సాగునీరు పుష్కలంగా ఉండడంతో వరిసాగు ముమ్మరంగా జరుగుతోంది. ఈ ఏడాది కూడా సాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉండడంతో జిల్లాలో దాదాపుగా 4.50 లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలతో పాటు దిగుబడి ఆధారంగా రానున్న రోజుల్లో 175 వరకు కేంద్రాలు ఏర్పాటు చేసే యోజనలో అధికారులు కసరత్తు చేస్తున్నారు.

గతంతో పోల్చుకుంటే..

సాధారణంగా జిల్లాలో 6 లక్షల నుంచి 7 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తుంటారు. దానికి అనుగుణంగా రబీలో దాదాపుగా 12 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 14 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తుంటుంది. కాగా గతంతో పోల్చుకుంటే సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గంలోని కొంత భాగం తిరుపతి జిల్లాలోకి వెళ్లిపోవడంతో జిల్లాలో సాగు కొంత తగ్గినట్లు అయింది. దీనివల్ల ఈ ఏడది రబీలో 4.50 లక్షల ఎకరాల్లో సాగు జరిగినట్లు అధికారులు గుర్తించారు.

తేదీల ప్రకారం

జిల్లాలో పండించిన ధాన్యం ఆధారంగా ప్రస్తుతం ప్రభుత్వం 3 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు కొనుగోలు చేయనుంది. రైతుల నుంచి వచ్చే దాని ప్రకారం కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ–క్రాప్‌ బుకింగ్‌ పూర్తి చేసి రైతులకు ధాన్యం సేకరణ వివరాలు కూడా అధికారులు తెలియజేశారు. రైతు భరోసా కేంద్రాల్లోని వీఏఏలు రైతులకు ధాన్యం సేకరణ గురించి వివరాలు అందజేస్తున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద వేచి ఉండకుండా ముందుగానే ఒక తేదీ ప్రకారం రైతులకు సమాచారం ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది ఎక్కడా ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చేసేందు కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.

రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

ప్రతి గింజను కొనుగోలు చేసే

విధంగా సన్నద్ధం

ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం అందిస్తున్న వీఏఏలు

రైతుల కోసం..

జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మొదటి విడతలో 124 కేంద్రాలు ఏర్పాటు చేశాం, ధాన్యం దిగుబడి ఆధారంగా మరికొన్ని కేంద్రాలను పెంచే యోచనలో ఉన్నాం. రైతులకు ముందుగానే కొనుగోలు తేదీ గురించి సమాచారం ఇవ్వడం ద్వారా రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం.

– నర్సోజి, ఏడీ,

వ్యవసాయశాఖ, నెల్లూరు

Read latest SPSR Nellore News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top