
2026 టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జింబాబ్వే క్రికెట్ జట్టుకు (Zimbabwe) అదనపు బోనస్ లభించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో (ICC T20 World Cup 2026 Africa Regional Qualifiers) ఆ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో నమీబియాపై (Namibia) 7 వికెట్ల తేడాతో గెలుపొంది, ఆఫ్రికా క్వాలిఫయర్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. జింబాబ్వే మరో నాలుగు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మరుమణి (74 నాటౌట్), డియాన్ మైర్స్ (44), ర్యాన్ బర్ల్ (26 నాటౌట్) జింబాబ్వే గెలుపులో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు బౌలింగ్‌లో నగరవ 3 వికెట్లతో సత్తా చాటాడు.
ఫైనల్లో ఓడినా నమీబియా కూడా జింబాబ్వేతో పాటు 2026 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి ఈ రెండు జట్లు ప్రపంచకప్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. జింబాబ్వే గత సీజన్ క్వాలిఫయర్స్‌లో సత్తా చాటలేక 2024 ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది.
ఇటీవలికాలంలో సికందర్ రజా నేతృత్వంలో బాగా మెరుగుపడిన జింబాబ్వే తిరిగి ప్రపంచకప్ బెర్త్ దక్కించుకుంది. జింబాబ్వే, నమీబియా బెర్త్‌లు ఖరారు కావడంతో ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్ల సంఖ్య 17కి చేరింది. ఇంకా మూడు జట్లు అర్హత సాధించాల్సి ఉంది. ఆ మూడు జట్లు ఆసియా క్వాలిఫయర్స్ ద్వారా ఖరారవుతాయి.
ఇప్పటిదాకా భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి.
చదవండి: రిషబ్ పంత్ రీఎంట్రీ..!