అతడికి నాపై కోపం పోలేదు: యువరాజ్‌ సింగ్‌ | Yuvraj Singh Reacts To Stuart Broad Throwing His Signed Jersey Dustbin | Sakshi
Sakshi News home page

నాపై కోపంతో చెత్తబుట్టలో పడేశాడు.. అతడి తండ్రి వచ్చి..: యువీ

Apr 10 2026 1:20 PM | Updated on Apr 10 2026 3:20 PM

Yuvraj Singh Reacts To Stuart Broad Throwing His Signed Jersey Dustbin

ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. టీ20 ప్రపంచకప్‌-2007లో తన అద్భుత ప్రదర్శన ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు భారత దిగ్గజ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా యువీ ఫీట్‌ నమోదు చేయగా.. అతడి బాధితుడిగా స్టువర్ట్‌ బ్రాడ్‌ అపవాదు మూటగట్టుకున్నాడు.

దిగ్గజ పేస్‌ బౌలర్లలో ఒకడిగా
అయితే, ఆ తర్వాత బ్రాడ్‌ ప్రపంచంలోని దిగ్గజ పేస్‌ బౌలర్లలో ఒకడిగా పేరు సంపాదించాడు. అయినప్పటికీ అతడి కెరీర్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు సమర్పించుకున్న బౌలర్‌గా ఇదొక చేదు అనుభవంగా మిగిలిపోయింది. ఆ కోపంలోనే ఆరోజు బ్రాడ్‌.. యువీ సంతకం చేసిన జెర్సీని చెత్తకుండీలో పారేశాడట.

ఈ విషయాల గురించి యువరాజ్‌ సింగ్‌ తాజాగా గుర్తు చేసుకున్నాడు. ‘‘టీ20 ఫార్మాట్లో అప్పటికి స్టువర్ట్‌ బ్రాడ్‌కు అంతగా అనుభవం లేదని అనుకుంటాను. కానీ ఆ తర్వాత అతడు దిగ్గజ ఫాస్ట్‌బౌలర్‌గా ఎదిగాడు. టెస్టు క్రికెట్‌లో 600కు పైగా వికెట్లు పడగొట్టాడు.

నా కుమారుడి కెరీర్‌ నాశనం
ఆరోజు తనలో పెరిగిన కసితో ఉన్నత శిఖరాలకు ఎదిగాడు. స్టువర్ట్‌ వాళ్ల నాన్న క్రిస్‌ బ్రాడ్.. టీమిండియా- ఆస్ట్రేలియా మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన సమయంలో నా దగ్గరికి వచ్చాడు. ‘నువ్వు నా కుమారుడి కెరీర్‌ను దాదాపుగా నాశనం చేసేశావు’ అన్నాడు.

ఇందుకు బదులుగా.. ‘సర్‌.. నేను నాకోసమే సిక్సర్లు బాదాను. అయితే, బౌలర్‌కు ఆ అనుభవం ఎలా ఉంటుందో నేను ఊహించగలను’ అని చెప్పాను. అప్పుడు ఆయన.. ‘స్టువర్ట్‌ కోసం నువ్వు షర్ట్‌పై సంతకం చేయాలి’ అని కోరాడు.

డస్ట్‌బిన్‌లో పడేశాడట
అప్పుడు నేను..‘నా టీమిండియాపై జెర్సీపై.. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సమర్పించుకున్న ఆటగాడిగా నాకూ అనుభవం ఉంది. అయితే, నువ్వు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా ఎదుగుతావు’ అని రాశాను. అయితే, క్రిస్‌ ఆ షర్టును స్టువర్ట్‌కు ఇచ్చినపుడు అతడు దానిని డస్ట్‌బిన్‌లో పడేశాడని ఇటీవలే చదివాను.

అతడు కోపంలో ఆ పని చేసి ఉంటాడు. కాబట్టి ఇది ఆమోదయోగ్యనీయమే’’ అని యువరాజ్‌ సింగ్‌ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌తో యూట్యూబ్‌ చాట్‌ సందర్భంగా యువీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. 

కాగా 2007లో ఐసీసీ తొలిసారిగా ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను ధోని సారథ్యంలోని టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2024లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో.. తాజాగా 2026లో సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలో భారత్‌ పొట్టి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ట్రోఫీలను ముద్దాడింది.‌

చదవండి: ‘ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం.. గుండెపోటు రావొచ్చు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement