అభిషేక్‌కు అన్యాయం చేశారు.. స‌న్‌రైజ‌ర్స్‌పై యువ‌రాజ్ ఫైర్‌ | Yuvraj Singh Lambasts SRH For Denying Abhishek Sharma IPL Captaincy | Sakshi
Sakshi News home page

IPL 2026: అభిషేక్‌కు అన్యాయం చేశారు.. స‌న్‌రైజ‌ర్స్‌పై యువ‌రాజ్ ఫైర్‌

Apr 3 2026 5:00 PM | Updated on Apr 3 2026 7:08 PM

Yuvraj Singh Lambasts SRH For Denying Abhishek Sharma IPL Captaincy

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్ వ్య‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. రెగ్యుల‌ర్ కెప్టెన్ పాట్ క‌మ్మిన్స్ గాయం కార‌ణంగా ఫ‌స్ట్ హాఫ్‌కు అందుబాటులో లేక‌పోవ‌డంతో జ‌ట్టు ప‌గ్గాల‌ను కిష‌న్‌కు ఎస్ఆర్‌హెచ్ యాజ‌మాన్యం అప్ప‌గించింది.

ట్రావిస్ హెడ్‌, క్లాసెన్‌, అభిషేక్ శ‌ర్మ వంటి ప్లేయ‌ర్లు ఉన్న‌ప్ప‌టికి కిష‌న్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌పరిచింది. తాజాగా ఇదే విష‌యంపై భార‌త మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. గత ఎనిమిదేళ్లుగా జట్టుతో ఉన్న అభిషేక్ శర్మకు కాకుండా కిష‌న్‌కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంపై యువీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

అభిషేక్ 2017 నుంచి స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టుతో పాటు ఉన్నాడు. కానీ కిష‌న్ మాత్రం గ‌తేడాదే ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. కిష‌న్ ఇటీవ‌లే జార్ఖండ్‌కు కెప్టెన్‌గా తొలి స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్‌ను అందించాడు. ఈ క్ర‌మంలోనే అత‌డిని స్టాండిన్ కెప్టెన్‌గా ఆరెంజ్ ఆర్మీ నియ‌మించింది. అత‌డికి డిప్యూటీగా మాత్రం అభిషేక్ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

"అభిషేక్‌కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌కోపోవ‌డం న‌న్ను నిరాశ‌ప‌రిచింది. ఇషాన్ కిష‌న్ అంటే నాకు కూడా ఇష్ట‌మే. అతడు ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ స్ధాయికి ఎదిగాడు. కానీ అభిషేక్ శ‌ర్మ గ‌త 7 ఏళ్లగా ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టుతో పాటు ఉన్నాడు. ప్ర‌తీ సీజ‌న్‌లోనూ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు.

ఎస్ఆర్‌హెచ్ కోసం త‌న సర్వస్వాన్ని ధారపోస్తున్నాడు. అతడు దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ జట్టుకు కూడా కెప్టెన్ కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అటువంటి వ్య‌క్తికి కెప్టెన్సీ ఇవ్వ‌క‌పోవ‌డం నిజంగా బాధాక‌రం. గ‌తంలో కూడా నాకు ఇలానే జ‌రిగింది. 2007లో నేను వైస్ కెప్టెన్‌గా ఉన్నాను. సెహ్వాగ్, భజ్జీ వంటి సీనియర్లు ఉన్నారు.

కానీ ఎక్కడి నుంచో ఎంఎస్ ధోనీ వచ్చి కెప్టెన్ అయ్యాడు. అప్పట్లో అది నాకు ఎలా అనిపించిందో, ఇప్పుడు అభిషేక్ కూడా అలాగే ఫీల్ అవుతుంటాడు. అయితే ధోని మాత్రం కెప్టెన్‌గా భార‌త్‌కు గొప్ప విజ‌యాలు అందించాడు.

అందుకు అత‌డే అర్హ‌డు అన్పించింది. ఇది నేను కేవ‌లం ఉదాహరణగా మాత్ర‌మే చెబుతున్నాను. కానీ ఒక ఆట‌గాడు కొన్నేళ్లు పాటు జ‌ట్టుకు తన సేవలు అందించినప్పుడు.  ఆ తర్వాత జరిగే పరిణామాలు కొంత నిరాశను కలిగిస్తాయి" స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ పేర్కొన్నాడు.
చదవండి: PSL 2026: ఉన్నపళంగా పాక్‌ నుంచి వెళ్లిపోయిన డేవిడ్‌ వార్నర్‌?

Advertisement
 
Advertisement
Advertisement