విరాట్‌ కోహ్లిపై యువరాజ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు | Yuvraj Singh Blames Virat Kohli For His Retirement, Drops Huge Bombshell | Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లిపై యువరాజ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు

Apr 3 2026 4:59 PM | Updated on Apr 3 2026 5:09 PM

Yuvraj Singh Blames Virat Kohli For His Retirement, Drops Huge Bombshell

టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిపై భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను రిటైర్మెంట్‌ ప్రకటించడానికి నాడు టీమిండియా కెప్టెన్‌గా ఉన్న విరాట్‌ కోహ్లి, హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి కారణమని బాంబు పేల్చాడు. తన ఎంపికను పరిగణలోకి తీసుకోవడం లేదన్న కనీస సమాచారం కూడా ఇవ్వకుండా అవమానించారని వాపోయాడు. 

సీనియర్‌ని అన్న గౌరవం కూడా లేకుండా తన పట్ల అవమానకరంగా ప్రవర్తించారని ఫైరయ్యాడు. ఫిట్‌నెస్‌ టెస్ట్‌ క్లియర్‌ చేసి, సెలెక్టర్ల నుంచి పిలుపు కోసం చాలాకాలం ఎదురుచూశానని తెలిపాడు. చివరికి ధోనితో మాట్లాడితే కాని విషయం అర్దం కాలేదని అన్నాడు. చేసేదేమీ లేక రిటైర్‌ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. 

నిజాయితీగా పరిస్థితిని వివరించి సహాయం చేశాడని ధోనికి కృతజ్ఞతలు తెలిపాడు. తన రిటైర్మెంట్‌ విషయంలో నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ తీరు కూడా తప్పుబట్టాడు. తాజాగా స్పోర్ట్స్‌ టాక్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించాడు.

కాగా, యువీ 2019 జూన్‌ 10న రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. అతను చివరిగా 2017లో టీమిండియా తరఫున వన్డే ఆడాడు. అవకాశాల కోసం చాలాకాలం వేచి చూసి, చేసేదేమీ లేక ఆట నుంచి వైదొలిగాడు. యువీ చివరి వన్డే ఆడే సమయానికి మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. ఆ ఏడాది 11 మ్యాచ్‌ల్లో 98.67 స్ట్రయిక్‌రేట్‌తో 372 పరుగులు చేశాడు. అయినా టీమిండియాలో స్థానం దక్కలేదు. 

17 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలు చేసి, రెండు ప్రపంచకప్‌ విజయాల్లో (2007 టీ20, 2011 వన్డే) కీలకపాత్ర పోషించిన యువీ అవమానకర రీతిలో రిటైర్మెంట్‌ ప్రకటించడాన్ని అప్పట్లో చాలామంది జీర్ణించుకోలేకపోయారు. క్యాన్సర్‌పై విజయం సాధించి, తిరిగి జట్టులోకి వచ్చిన యువరాజ్‌ ఆటకు సంబంధించి తన చివరి కోరికను తీర్చుకోకుండానే రిటైరయ్యాడు. 

యువీకి 2019 వన్డే వరల్డ్‌కప్‌ ఆడాలని కోరిక ఉండింది. ఇందుకోసమే అతను వయసు మీద పడుతున్నా తీవ్రంగా శ్రమించి ఫిట్‌నెస్‌ మెయిన్‌టైన్‌ చేశాడు. అయినా సెలెక్టర్లు అతనికి మొండిచెయ్యి చూపించారు. 

వాస్తవానికి యువీని పక్కకు పెట్టడానికి విరాట్‌-రవిశాస్త్రి వద్ద కూడా ఎలాంటి వ్యక్తిగత కారణాలూ లేవు. కేవలం యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే అలా చేశారు. 2015 వరల్డ్‌ కప్‌ సమయంలో నాటి కెప్టెన్‌ ధోని కూడా గౌతమ్‌ గంభీర్‌, హర్భజన్‌ సింగ్‌లను ఈ కారణంగానే పక్కన పెట్టాడు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement