
ఈ ఏడాది ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్న టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓ అరుదైన మైలురాయికి చేరువయ్యాడు. యశస్వి.. త్వరలో శ్రీలంకతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లో మరో 47 పరుగులు చేస్తే.. ఈ ఏడాది 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. యశస్వి ఈ ఏడాది ఇప్పటివరకు 16 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీల సాయంతో 953 పరుగులు చేశాడు.
ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో యశస్వి తర్వాతి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ ఉన్నాడు. జద్రాన్ 27 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, 8 అర్దసెంచరీల సాయంతో 844 పరుగులు చేశాడు.
ఈ జాబితాలో యశస్వి, జద్రాన్ తర్వాతి స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 22 ఇన్నింగ్స్‌లు ఆడి 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీల సాయంతో 833 పరుగులు చేశాడు.
ఈ జాబితా టాప్-10లో యశస్వి, జద్రాన్, రోహిత్ తర్వాత కుశాల్ మెండిస్ (833), రహ్మానుల్లా గుర్బాజ్ (773), బాబర్ ఆజమ్ (709), శుభ్‌మన్ గిల్ (691), పథుమ్ నిస్సంక (680), మహ్మద్ రిజ్వాన్ (632), చరిత్ అసలంక (596) ఉన్నారు.
ఇదిలా ఉంటే, ఇటీవల జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో యశస్వి మూడు మ్యాచ్‌లు ఆడి 70కి పైగా సగటుతో 141 పరుగులు చేశాడు. ఈ సిరీస్ నాలుగో టీ20లో యశస్వి అజేయమైన 93 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత్ తదుపరి జులై 27 నుంచి శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది.