WTC Final: వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా న్యూజిలాండ్‌

WTC Final: Team India Lost Early Wickets On Day Six - Sakshi

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ విజేత న్యూజిలాండ్‌
వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌లో న్యూజిలాండ్‌ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ జట్టు 2 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్‌ కాగా, న్యూజిలాండ్‌ 249 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 170 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. 139 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన కివీస్‌ జట్టు భారత్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 

గెలుపు దిశగా పయనిస్తున్న కివీస్‌..
139 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కివీస్‌.. ఆతరువాత మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోర్‌ బోర్డును ముందుకు తీసుకెళ్తుంది. కెప్టెన్‌ విలియమ్సన్‌(22), రాస్‌ టేలర్‌(30) ఆచితూచి ఆడుతున్నారు. కివీస్‌ గెలుపునకు మరో 47 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో మరో 8 వికెట్లు ఉన్నాయి. ఆఖరి రోజు ఆటలో మరో 18 ఓవర్లు మిగిలి ఉన్నాయి.భారత బౌలర్లలో అశ్విన్‌కు రెండు వికెట్లు దక్కాయి.

రెండో వికెట్‌ కోల్పోయిన కివీస్‌.. కాన్వే(19) ఔట్‌
టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ కివీస్‌ను ముప్పతిప్పలు పెడుతున్నాడు. 33 పరుగుల వద్ద లాథమ్‌ వికెట్‌ పడగొట్టిన యాష్‌.. 44 పరుగుల వద్ద కివీస్‌ నయా సంచలనం డెవాన్‌ కాన్వేను(19) పెవిలియన్‌ బాట పట్టించాడు. కివీస్‌ గెలవాటంటే మరో 95 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 8 వికెట్లుండగా, మరో 35 ఓవర్ల ఆట మిగిలి ఉంది.

తొలి వికెట్‌ కోల్పోయిన కివీస్‌.. లాథమ్‌(9) స్టంప్‌ అవుట్‌
139 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ జట్టు.. 33 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌(2).. అశ్విన్‌ బౌలింగ్‌లో స్టంప్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. పంత్‌ అద్భుతంగా బంతిని అందుకుని వికెట్లకు గిరాటు వేయడంతో కివీస్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. కాన్వే(14), విలియమ్సన్‌(0) క్రీజ్‌లో ఉన్నారు. కివీస్‌ గెలవాలంటే మరో 109 పరుగులు చేయాలి.

టీమిండియా 170 ఆలౌట్‌.. కివీస్‌ టార్గెట్‌ 139
170 పరుగుల వద్ద టీమిండియా ఆలౌటైంది. సౌథీ బౌలింగ్‌లో లాథమ్‌ క్యాచ్‌ అందుకోవడంతో బుమ్రా డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్‌.. కివీస్‌ ముందు 139 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కివీస్‌ బౌలర్లలో సౌథీ 4, బౌల్ట్‌ 3, జేమీసన్‌ 2, వాగ్నర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

టీమిండియా తొమ్మిదో వికెట్‌ డౌన్‌.. షమీ(13) ఔట్‌
170 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. సౌథీ బౌలింగ్‌లో లాథమ్‌ క్యాచ్‌ అందుకోవడంతో షమీ 13 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 138 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజ్‌లో ఇషాంత్‌, బుమ్రా ఉన్నారు. 

టెయిలెండర్లపై బౌల్ట్‌ ప్రతాపం.. అశ్విన్‌(7) ఔట్‌
156 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్‌ కూడా కోల్పోయింది. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో ఫస్ట్‌ స్లిప్‌లో ఉన్న రాస్‌ టేలర్‌కు క్యాచ్‌ ఇచ్చి యాష్‌(7) వెనుదిరిగాడు. దీంతో ఒకే స్కోర్‌ వద్ద టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. టీమిండియా టెయిలెండర్లపై బౌల్ట్‌ ప్రతాపం చూపుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా 124 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజ్‌లో షమీ, ఇషాంత్‌ ఉన్నారు.

పంత్‌(41) ఔట్‌..124 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
భారత జట్టు ఆఖరి ఆశా కిరణం రిషబ్‌ పంత్‌ 41 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. బౌల్ట్‌ బౌలింగ్‌లో హెన్రీ నికోల్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పంత్‌ వెనుదిరిగాడు. దీంతో 156 పరుగుల స్కోర్‌ వద్ద భారత్‌ ఏడో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 124 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజ్‌లో అశ్విన్‌(7), షమీ(0) ఉన్నారు. 

టీమిండియా ఆరో వికెట్‌ డౌన్‌, జడేజా(16) ఔట్‌
142 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది. అప్పటివరకు ఓపికగా ఆడిన జడేజా వాగ్నర్‌ బౌలింగ్‌లో వాట్లింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి 16 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 110 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజ్‌లో పంత్‌(34), అశ్విన్‌(0) ఉన్నారు. 

ఐదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా, రహానే(15) ఔట్‌
బౌల్ట్‌ బౌలింగ్‌లో బౌండరీ బాది జోరుమీదున్నట్లు కనిపించిన రహానే 15 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. లెగ్‌ గ్లాన్స్‌ చేసే ప్రయత్నంలో వాట్లింగ్‌ చేతికి చిక్కి పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో 109 పరుగుల స్కోర్‌ వద్ద టీమిండియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 77 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రిషబ్‌ పంత్‌(21), జడేజా(0) క్రీజ్‌లో ఉన్నారు.  కివీస్‌ బౌలర్లలో జేమీసన్‌, సౌథీ చెరో రెండు వికెట్లు, బౌల్ట్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

సౌతాంప్ట‌న్: ఆరో రోజు ఆట ప్రారంభం కాగానే టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్లు కోహ్లీ(13), పుజారా(15)లు పరుగు వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. వీరిద్దరిని కైల్‌ జేమీసన్‌ బోల్తా కొట్టించాడు. కోహ్లీ వికెట్‌ కీపర్‌ వాట్లింగ్‌కు క్యాచ్‌ అందించి ఔట్‌ కాగా, పుజారా.. రాస్‌ టేలర్‌ చేతికి చిక్కి పెవిలియన్‌ బాట పట్టాడు. కైల్ జేమిసన్ మ‌రో సారి త‌న బౌలింగ్ లైన్‌తో టీమిండియాను ఇబ్బంది పెడుతున్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే దిశగా సాగేట్టు కనిపిస్తున్నాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లోనూ కోహ్లీని జేమిస‌నే ఔట్ చేయడం విశేషం. ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం టీమిండియా 40 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రహానే, పంత్‌ క్రీజ్‌లో ఉన్నారు. కివీస్‌ బౌలర్లలో జేమీసన్‌, సౌథీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top