ఆర్సీబీకి భారీ షాక్‌! | Injury-Hit RCB Suffer another Massive Blow With Asha Sobhana Ruled Out Of WPL 2025, See More Details Inside | Sakshi
Sakshi News home page

WPL 2025: టోర్నీ ఆరంభానికి ముందే ఆర్సీబీకి భారీ షాక్‌!

Feb 13 2025 9:25 PM | Updated on Feb 14 2025 9:12 AM

WPL 2025: Injury Hit RCB Suffer another Massive Blow

ఆశా శోభన (PC: BCCI)

మహిళల ప్రీమియర్‌ లీగ్‌(WPL)-2025 ఆరంభానికి ముందే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వుమెన్స్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికే పలువురు ప్లేయర్లు గాయాల వల్ల ఈ టోర్నమెంట్‌కు దూరం కాగా.. తాజాగా స్టార్‌ స్పిన్నర్‌ ఆశా శోభన కూడా తప్పుకొంది.

ఈ నేపథ్యంలో ఆమె స్థానాన్ని భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నుఝత్‌ పర్వీన్‌తో భర్తీ చేస్తున్నట్లు ఆర్సీబీ గురువారం ప్రకటన విడుదల చేసింది. ‘‘దురదృష్టవశాత్తూ.. మోకాలి గాయం కారణంగా మా చాంపియన్‌ ఆల్‌రౌండర్‌ ఆశా శోభన(Asha Sobhana) డబ్ల్యూపీఎల్‌-2025 మొత్తానికి దూరమైంది.

స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నుఝత్‌ పర్వీన్‌ ఈ సీజన్‌లో ఆశా శోభన స్థానాన్ని భర్తీ చేస్తుంది. నుఝత్‌ ఆర్సీబీకిలో నీకు స్వాగతం’’ ఆర్సీబీ సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.

కాగా 33 ఏళ్ల లెగ్‌ స్పిన్నర్‌ ఆశా శోభన మహిళల టీ20 ప్రపంచకప్‌-2024 సందర్భంగా చివరగా భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. నాడు గ్రూప్‌ దశలో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఆమె గాయపడింది. అయితే, ఇంత వరకు కోలుకోలేదు. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్‌ తాజా ఎడిషన్‌ మొత్తానికి ఆమె దూరమైంది.

గత సీజన్‌లో ఆశా శోభన మొత్తంగా పన్నెండు వికెట్లు తీసి జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించింది. ఇక ఇదివరకే సోఫీ మెలినెక్స్‌, కేట్‌ క్రాస్ గాయాల కారణంగా ఆర్సీబీకి దూరం కాగా.. సోఫీ డివైన్‌ టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది.

మరోవైపు.. ఆల్‌రౌండర్‌ శ్రేయాంక పాటిల్‌ కూడా గాయం వల్ల స్వదేశంలో పలు సిరీస్‌లకు దూరమైన విషయం తెలిసిందే. కాబట్టి ఆమె ఆర్సీబీ తుదిజట్టులోకి వస్తుందా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది.

ముంబై ఇండియన్స్‌లోకి పరుణిక సిసోడియా
డబ్ల్యూపీఎల్‌ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్‌కు కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ పూజా వస్త్రాకర్‌ సీజన్‌ మొత్తానికి దూరమైంది. ఆమె స్థానంలో పరుణిక సిసోడియా జట్టులోకి వచ్చింది. కనీస ధర రూ. 10 లక్షలతో పరుణిక ముంబై ఇండియన్స్‌లో చేరింది.

కాగా ఇటీవల జరిగిన మహిళల అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీలో పరుణిక అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ నుంచి ఆమెకు పిలుపు రావడం గమనార్హం. ఇక ఫిబ్రవరి 14- మార్చి 15 వరకు మహిళల ప్రీమియర్‌ లీగ్‌ జరుగనుంది. ముంబై ఇండియన్స్‌ వుమెన్స్‌, ఆర్సీబీ వుమెన్స్‌, యూపీ వారియర్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య మొత్తంగా 22 మ్యాచ్‌లు జరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement