రాణించిన కర్రన్‌, బట్లర్‌.. విండీస్‌పై ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లండ్‌

WI VS ENG 2nd ODI: England Beat West Indies By 6 Wickets - Sakshi

ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్‌ తొలి వన్డేలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌.. ఇంగ్లండ్‌ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 39.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. సామ్‌ కర్రన్‌, లివింగ్‌స్టోన్‌ చెరో 3 వికెట్లు.. అట్కిన్సన్‌, రెహాన్‌ అహ్మద్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ షాయ్‌ హోప్‌ (68), షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (63) అర్ధసెంచరీలతో రాణించారు. తొలి వన్డేలో మెరుపు శతకంతో విండీస్‌ను గెలిపించిన హోప్‌ ఈ మ్యాచ్‌లోనూ బాధ్యతాయుతమైన ఇన్ని​ంగ్స్‌ ఆడాడు. 

అనంతరం 203 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. విల్‌ జాక్స్‌ (73), కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ (58 నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించడంతో 32.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాక్స్‌, బట్లర్‌లతో పాటు హ్యారీ బ్రూక్‌ (43 నాటౌట్‌) కూడా రాణించాడు. విండీస్‌ బౌలర్లలో గుడకేశ్‌ మోటీకి రెండు, రొమారియో షెపర్డ్‌, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌లకు తలో వికెట్‌ దక్కింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే డిసెంబర్‌ 9న జరుగనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top