షారుఖ్ ఖాన్‌తో రింకూ (PC: BCCI/KKR)
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ అజింక్య రహానే సహచర ఆటగాడు రింకూ సింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. అద్భుతమైన ఆట తీరుతో అనతికాలంలోనే రింకూ కేకేఆర్ ముఖచిత్రంగా మారిపోయాడని కొనియాడాడు.
కాగా టీమిండియా స్టార్, విధ్వంసకర ఆటగాడు రింకూ సింగ్‌ను కేకేఆర్ వైస్ కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో మూడుసార్లు విజేతగా నిలిచిన కేకేఆర్ జట్టుకు ప్రస్తుతం అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
అభిషేక్ నాయర్ సూచనతోనే
అయితే, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అతడి డిప్యూటీగా రింకూ సింగ్‌ను నియమిస్తున్నట్లు ఫ్రాంచైజీ మంగళవారం వెల్లడించింది. ‘మైదానంలో వైస్ కెప్టెన్‌గా రింకూ సింగ్ (Rinku Singh)... రహానేకు చేదోడు వాదోడుగా నిలవనున్నాడు’ అని కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ తెలిపాడు. ఫ్రాంచైజీ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ సూచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
‘చాన్నాళ్లుగా రింకూను గమనిస్తున్నా. జట్టు కోసం ఏదైనా చేయాలని తాపత్రయ పడుతుంటాడు. అందుకే అతడికి కాస్త అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నాం. దానికి ఇదే సరైన సమయం అని భావించాం’ అని నాయర్ అన్నాడు.
రూ. 80 లక్షల నుంచి రూ. 13 కోట్లకు
కాగా 2018లో రూ. 80 లక్షలు పెట్టి రింకూను తీసుకున్న కోల్‌కతా ఫ్రాంచైజీ... గతేడాది అతడికి రూ. 13 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది. ఇక 2023 ఐపీఎల్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో యశ్ దయాల్ వేసిన చివరి ఓవర్‌లో ఆఖరి ఐదు బంతులకు సిక్స్‌లు బాది జట్టును గెలిపించిన రింకూ సింగ్ ఒక్కసారిగా స్టార్‌గా ఎదిగాడు.
ఫినిషర్ పాత్ర
ఆ తర్వాత కూడా నిలకడ కొనసాగిస్తూ జట్టుకు అవసరమైన సమయంలో ఫినిషర్ పాత్ర పోషించాడు. దీంతో ఫ్రాంచైజీ అతడిపై నమ్మకముంచింది. ఈ నేపథ్యంలో ‘టీమ్ మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు. వైస్ కెప్టెన్‌గా ఎంపికైనందుకు ఆనందంగా ఉంది. జట్టు విజయం కోసం నావంతు కృషి చేస్తా’ అని రింకూ పేర్కొన్నాడు. ఇక రహానే మాట్లాడుతూ.. ‘‘రింకూ ఎదిగిన తీరు అద్బుతం.
కేకేఆర్ గురించి చర్చ వస్తే మొదటగా గుర్తొచ్చే పేరు షారుఖ్ ఖాన్. తర్వాత రింకూ సింగే అందరికీ గుర్తుకు వస్తాడు’’ అని ప్రశంసలు కురిపించాడు. కాగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, నటి జూహీ చావ్లా, ఆమె భర్త జై మెహతా కేకేఆర్ సహ యజమానులుగా ఉన్న సంగతి తెలిసిందే.
చదవండి: రూ. 15 వేల కోట్లకు RR అమ్మకం.. షేన్ వార్న్ వాటా ఎంతంటే?


