ఇదేం సెలక్షన్‌?.. మరీ ఇంత దారుణమా? | Ex India Captain Dilip Vengsarkar Brutally Criticizing Chief Selector Ajit Agarkar, Says What Kind Of Selection Is This | Sakshi
Sakshi News home page

ఇదేం సెలక్షన్‌?.. మరీ ఇంత దారుణమా?

May 22 2026 1:37 PM | Updated on May 22 2026 4:49 PM

What Kind Of Selection Is This: Agarkar Lambasted By Ex India Captain

అజిత్‌ అగార్కర్‌

టీమిండియా సెలక్షన్‌ కమిటీ తీరుపై మాజీ చీఫ్‌ సెలక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ మండిపడ్డాడు. ఆటగాళ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు. రంజీల్లో సత్తా చాటిన వారికి జట్టులో చోటు ఇవ్వనపుడు.. అసలు ఇలాంటి టోర్నీలు ఎందుకు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో ఏకైక టెస్టు, మూడు వన్డేలకు భారత జట్టును ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు బౌలింగ్‌ విభాగంలో మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద​ కృష్ణ, మానవ్‌ సుతార్‌, గుర్నూర్‌ బ్రార్‌, హర్ష్‌ దూబేలకు చోటిచ్చారు.

60 వికెట్లు కూల్చిన ఆకిబ్‌ నబీ
అయితే, 2025-26 రంజీ సీజన్‌లో జమ్మూ కశ్మీర్‌ తరఫున ఏకంగా 60 వికెట్లు కూల్చిన ఆకిబ్‌ నబీని మాత్రం పక్కనపెట్టారు. జమ్మూ జట్టు తొలిసారి రంజీ చాంపియన్‌గా నిలపడంలో ఈ ఫాస్ట్‌ బౌలర్‌దే కీలక పాత్ర. దీంతో సర్వత్రా ప్రశంసలు కురవగా.. అఫ్గన్‌తో టెస్టు జట్టుకు ఎంపిక చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అతడికి అన్యాయం చేశారు
అయితే, అనూహ్య రీతిలో సెలక్టర్లు ఆకిబ్‌ను పక్కనపెట్టారు. ఈ నేపథ్యంలో మాజీ చీఫ్‌ సెలక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌.. సెలక్షన్‌ కమిటీ నాయకుడు అజిత్‌ అగార్కర్‌ తీరుపై మండిపడ్డాడు. ‘‘ఈ సెలక్టర్లు ఆకిబ్‌ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యపరిచింది. అసలు ఇదేం సెలక్షన్‌?..

ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. వీళ్లంతా కలిసి అతడికి అన్యాయం చేశారు. నిజంగా అతడిని పక్కనపెట్టడం అర్థంలేని చర్య. ప్రస్తుతం అతడి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహింగచలరా?

 బీసీసీఐ వెంటనే వీటిని తీసేయాలి
రంజీ ట్రోఫీలో ఒక సీజన్‌లో 60 వికెట్లు తీశాడు. అయినా సరే అతడిని ఎంపిక చేయలేదు. దేశీ క్రికెట్‌లో సత్తా చాటడం పనికిరాదని సెలక్టర్లు భావిస్తే.. బీసీసీఐ వెంటనే ఈ టోర్నీలను తీసేయాలి.

వికెట్లు తీసే బౌలర్లను పక్కనపెట్టడం ఏమిటి? అతడి వేగం తక్కువగా ఉండొచ్చు. కానీ నిలకడగా వికెట్లు తీయడంలో అతడు దిట్ట. టీమిండియాలోకి వస్తే కోచ్‌లు అతడిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దవచ్చు. కానీ మీరేం చేస్తున్నారు?’’ అని దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టుకు టీమిండియా
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్‌), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్ట‌న్‌ సుందర్, మ‌హ్మ‌ద్‌ సిరాజ్, కుల్దీప్‌ యాదవ్, నితీశ్‌ కుమార్ రెడ్డి, ధ్రువ్‌ జురెల్, ప్రసిధ్‌ కృష్ణ, గుర్నూర్ బ్రార్‌, హ‌ర్ష్ దూబే.

అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా
శుబ్‌మన్‌ గిల్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శ్రేయ‌స్‌ అయ్యర్ (వైస్ కెప్టెన్‌), కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్ట‌న్ సుందర్, కుల్దీప్‌ యాదవ్, ప్రసిధ్‌ కృష్ణ, ప్రిన్స్‌ యాదవ్, గుర్నూర్‌ బ్రార్‌, హ‌ర్ష్‌ దూబే, రోహిత్ శర్మ*, హార్దిక్ పాండ్యా*.

చదవండి: సన్‌రైజర్స్‌కు తప్పని గండం.. అలా అయితేనే టాప్‌-2లో చోటు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement