ODI WC 2023: భారత్‌లో వరల్డ్‌కప్‌.. మాకు మంచి అవకాశం.. టైటిల్‌ నిలబెట్టుకుంటాం! అయితే..

WC 2023 Joe Root: Great chance For England To Defend Title In India - Sakshi

ICC ODI World Cup 2023: ‘‘మా ముందున్న గొప్ప అవకాశం ఇది. వరల్డ్‌కప్‌ ట్రోఫీని తిరిగి దక్కించుకోవడానికి.. టైటిల్‌ నిలబెట్టుకోవడానికి మంచి ఛాన్స్‌ ముందుంది. ఇండియా పిచ్‌లపై అవగాహన, అక్కడ ఆడిన అనుభవం మా జట్టుకు పనికొస్తుంది’’ అని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ అన్నాడు.

ఇంగ్లండ్‌ టెస్టు జట్టు సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగిన రూట్‌ ప్రస్తుతం బ్యాటర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. కెప్టెన్సీ వదిలేసిన తర్వాత సం‍ప్రదాయ క్రికెట్‌లో మరింత దూకుడుగా ఆడుతూ రికార్డులు సృష్టిస్తున్న అతడు.. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించాడు.

భారత్‌ వేదికగా ఈ ఏడాది జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో చోటే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ లీగ్‌ ట్వంటీ20లో దుబాయ్‌ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ స్టార్‌ బ్యాటర్‌.. ప్రపంచకప్‌ సన్నాహకాలు, తమ జట్టు గెలుపు అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

మాకే అవకాశాలు ఎక్కువ.. అయితే..
పీటీఐతో రూట్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ టీ20 లీగ్‌ ద్వారా సరికొత్త విషయాలు నేర్చుకుంటున్నా. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నాకు ఇదో కొత్త అనుభూతి. బ్యాటర్‌గా మరింత మెరుగుపడటానికి, రాటుదేలడానికి ఇదెంత వరకు ఉపయోగ పడుతుందో చూడాలి.

ఈ ఏడాది చివర్లో ఇండియాలో వరల్డ్‌కప్‌ ఆడాల్సి ఉంది. ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోవాలంటే కఠినంగా శ్రమించకతప్పదు. మా జట్టు టైటిల్‌ను నిలబెట్టుకునే సువర్ణావకాశం ముందుంది. ఇండియాలో చాన్నాళ్లుగా మావాళ్లు ఆడుతున్నారు. అక్కడి పిచ్‌లపై మా జట్టులోని దాదాపు అందరు ఆటగాళ్లకు మంచి అవగాహన ఉంది.

అయితే, స్పిన్‌ను ఎంత ప్రభావంతంగా ఎదుర్కోగలమన్న అంశం మీదే మా గెలుపు అవకాశాలు ఆధారపడి ఉంటాయి. అదే విధంగా వరల్డ్‌కప్‌ నాటికి 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఎంత నిలకడగా ఆడతామనేది కూడా ప్రభావం చూపుతుంది’’ అని చెప్పుకొచ్చాడు.

అప్పుడు కేవలం 7 పరుగులే
కాగా ఐపీఎల్‌ కారణంగా ఇంగ్లండ్‌తో పాటు ఇతర విదేశీ ఆటగాళ్లకు కూడా భారత్‌లో ఆడిన అనుభవం ఈ మేజర్‌ టోర్నీలో ఉపయోగపడనుంది. ఇక సొంతగడ్డపై 2019లో న్యూజిలాండ్‌తో ఫైనల్‌లో తలపడిన ఇంగ్లండ్‌ వరల్డ్‌కప్‌ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ 84 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలుపుబాట పట్టించాడు. ఇక ఈ మ్యాచ్‌లో జో రూట్‌ 30 బంతులు ఎదుర్కొని కేవలం 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top