సిల్వ‌ర్ టు గోల్డెన్ డ‌క్‌.. కోహ్లీ చెత్త రికార్డు | Virat Kohli Trolled For Twin Ducks In IPL 2026, Extends Unwanted IPL Record Streak, Video Went Viral | Sakshi
Sakshi News home page

సిల్వ‌ర్ టు గోల్డెన్ డ‌క్‌.. కోహ్లీ చెత్త రికార్డు

May 10 2026 10:58 PM | Updated on May 11 2026 5:24 PM

Virat Kohli Trolled For Twin Ducks In IPL 2026 Silver To Golden Duck

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఓపెన‌ర్ విరాట్ కోహ్లీ గోల్డెన్ డ‌క్‌గా వెనుదిరిగాడు. దీప‌క్ చాహ‌ర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ నాలుగో బంతిని మిడాఫ్ దిశ‌గా ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే అక్క‌డ కాచుకు కూర్చున్న రాజ్‌బ‌వాకు స్ట‌న్నింగ్ క్యాచ్ అందుకోవ‌డంతో కోహ్లీ వెనుదిరిగాడు. ఈ నేప‌థ్యంలో కోహ్లీ డ‌కౌట్ల విష‌యంలో చెత్త రికార్డు న‌మోదు చేశాడు. 

ఈ సీజ‌న్‌లో తొలిసారి గోల్డెన్ డ‌క్‌ అయిన కోహ్లీకి ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఎనిమిదో గోల్డెన్‌ డకౌట్‌ కావడం గమనార్హం. అంతేకాదు ఈ సీజన్‌లో వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. త‌ద్వారా నాలుగేళ్ల త‌ర్వాత రెండు వ‌రుస మ్యాచ్‌ల్లో డ‌కౌట్ అయిన ఆట‌గాడిగా కోహ్లీ నిలిచాడు. ల‌క్నోతో జ‌రిగిన గ‌త మ్యాచ్‌లోనూ కోహ్లీ 2 బంతులెదుర్కొని సున్నా ప‌రుగుల వ‌ద్ద ఔట‌య్యాడు. 

2022 సీజ‌న్‌లో కోహ్లీ ల‌క్నో, ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌ల్లో ఇదే మాదిరిగా డ‌కౌట్ అయ్యాడు. దీంతో సోష‌ల్ మీడియాలో అభిమానులు కోహ్లీని ట్రోల్ చేశారు. 'సిల్వ‌ర్ డ‌క్‌ను గోల్డెన్ డ‌క్‌గా మార్చుకున్న ఘ‌న‌త కోహ్లీ సొంతం' అంటూ కామెంట్లు చేశారు. ఇక తాజా డ‌కౌట్‌తో కోహ్లీ మ‌రిన్ని చెత్త రికార్డులు మూట గ‌ట్టుకున్నాడు. అవేంటో ఒక‌సారి ప‌రిశీలిద్దాం.

👉ముంబై ఇండియ‌న్స్‌పై కోహ్లీ డ‌కౌట్ కావ‌డం ఇది మూడోసారి. గ‌తంలో ఎస్ఆర్‌హెచ్‌పై కూడా మూడుసార్లు డ‌కౌట్ అయ్యాడు. ఇక ల‌క్నోపై రెండుసార్లు, పంజాబ్‌, గుజ‌రాత్‌, కేకేఆర్‌, రాజ‌స్తాన్‌ల‌పై ఒక్కోసారి డ‌కౌట్‌గా వెనుదిరిగాడు.

👉 ఐపీఎల్‌లో కోహ్లీ గోల్డెన్ డ‌కౌటవ్వ‌డం నాలుగేళ్ల‌లో ఇదే తొలిసారి. 2022 సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో  ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగాడు. ఆ సీజ‌న్‌లో ఎస్ఆర్‌హెచ్‌తో ఆడిన త‌ర్వాతి మ్యాచ్‌లోనూ కోహ్లీ డ‌కౌట్ అయ్యాడు. తాజా సీజ‌న్‌లోనూ వ‌రుస‌గా ల‌క్నో, ముంబైతో మ్యాచ్‌ల్లోనూ మ‌రోసారి రిపీట్ చేశాడు.

👉 ఐపీఎల్‌ల్లో అత్య‌ధిక సార్లు గోల్డెన్‌డ‌క్ అయిన ఆట‌గాళ్ల జాబితాలో కోహ్లీ (8 సార్లు).. ఇషాన్ కిష‌న్‌, సునీల్ న‌రైన్‌ల‌తో క‌లిసి సంయుక్తంగా  ఉన్నాడు. వీరి కంటే ముందు ర‌షీద్ ఖాన్ (12 సార్లు), మ్యాక్స్‌వెల్ (10 సార్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

👉ఈ సీజ‌న్‌లో కోహ్లీ బ్యాటింగ్‌లో మెరుపులు త‌గ్గిన‌ప్ప‌టికీ ప‌ర్వాలేద‌నిపిస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 379 ప‌రుగులు సాధించాడు. అయితే గ‌త నాలుగు ఇన్నింగ్స్‌లు క‌లిపి కోహ్లీ చేసిన ప‌రుగులు 51 మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం.

చదవండి: లేటు వయసులో భువనేశ్వర్‌ కొత్త చరిత్ర!

Advertisement
 
Advertisement
Advertisement