సూర్యకుమార్‌ వివాదాస్పద ఔట్‌పై కోహ్లి ఫైర్‌

Virat Kohli Asks Why There Cant Be I Dont Know Call From Umpires - Sakshi

అహ్మదాబాద్: టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ వివాదాస్పద రీతిలో ఔటైన తీరుపై కెప్టెన్ విరాట్‌ కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాలుగో టీ20లో సామ్‌ కర్రన్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ ఆడిన షాట్‌ను డేవిడ్‌ మలాన్‌ వన్‌ స్టెప్‌ క్యాచ్‌ పట్టాడు. బంతి నేలకు తాకి ఫీల్డర్‌ చేతిలో పడ్డట్టు స్పష్టంగా కనిపించినా అంపైర్‌ ఔటివ్వడాన్ని కోహ్లి తప్పుపట్టాడు. అనుమానాస్పద క్యాచ్ విషయంలో థర్డ్‌ అంపైర్‌.. ఫీల్డ్‌ అంపైర్‌ కాల్‌ ఆధారంగా ఔట్‌గా ప్రకటించడంపై ఆయన మండిపడ్డాడు. ఇలాంటి సందర్భాల్లో అంపైర్లకు 'నాకు తెలీదు' అనే ఆప్షన్‌ ఎందుకుండకూడదని ఆయన ప్రశ్నించాడు. కాగా, అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించి, 2-2తో సిరీస్‌ను సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్(31 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. 

నాల్గో టీ20లో భాగంగా స్యామ్‌ కరన్‌ వేసిన 14వ ఓవర్‌ తొలి బంతిని స్వీప్‌షాట్‌తో లెగ్‌సైడ్‌ సిక్సర్‌ బాదిన యాదవ్‌ తర్వాత బంతిని అలాగే ఆడాడు. కానీ ఫైన్‌లెగ్‌లో మలాన్‌ క్యాచ్‌పట్టాడు. అయితే బంతి అతని చేతుల్లో పడీపడగానే నేలనీ తాకింది. టీవీ అంపైర్‌ పలుమార్లు రీప్లే చేసి నిమిషాలపాటు చూసి ఫీల్డ్‌ అంపైర్‌ ఇచ్చిన ‘సాఫ్ట్‌ సిగ్నల్‌ అవుట్‌’కే మొగ్గుచూపడంతో సూర్యకుమార్‌ క్రీజు వీడాడు. అంత స్పష్టంగా నేలను తాకినా అవుటివ్వడంపై డగౌట్‌లో ఉన్న కోహ్లి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. కెరీర్‌లో ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సూర్యకుమార్‌ యాదవ్‌ (31 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడాడు. ఆర్చర్‌కు 4 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. బెన్‌ స్టోక్స్‌ (23 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), జేసన్‌ రాయ్‌ (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఈ దశలో 17వ ఓవర్‌ వేసిన శార్దుల్‌ వాళ్లిద్దరిని వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చడంతో మ్యాచ్‌ భారత్‌ వైపు తిరిగింది. కోహ్లి సేన 8 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top