ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన కొద్ది రోజులకే భారత ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అంతర్జాతీయ ఫ్రాంచైజీ క్రికెట్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అతడు.. లంక ప్రీమియర్ లీగ్‌లోని క్యాండీ రాయల్స్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. జూలై 17 నుంచి ప్రారంభంకానున్న ఎల్‌పీఎల్ ఆరో సీజన్‌లో విజయ్ క్యాండీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు.

విజయ్ ఐపీఎల్‌తో పాటు భారత దేశవాళీ క్రికెట్ మొత్తానికి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. భారత క్రికెట్‌తో బంధాన్ని పూర్తిగా తెంచుకుంటేనే భారతీయులకు ఇతర దేశాల క్రికెట్ లీగ్‌ల్లో ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టే విజయ్‌కు లంక ప్రీమియర్ లీగ్ ఆడేందుకు లైన్ క్లియర్ అయ్యింది.
విజయ్ తన రిటైర్మెంట్ ప్రకటనలోనే కొత్త అవకాశాలు, మరింత క్రికెట్ ఆడేందుకు అంటూ లంక ప్రీమియర్ లీగ్ ఎంట్రీపై సంకేతాలు ఇచ్చాడు. విజయ్.. క్యాండీ రాయల్స్‌లో వనిందు హసరంగ, ఏంజెలో మాథ్యూస్, మొయిన్ అలీ తదితర స్టార్లతో కలిసి ఆడతాడు.
35 ఏళ్ల విజయ్ భారత్ తరఫున 12 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు 324 పరుగులు, 9 వికెట్లు తీశాడు. కుడి చేతి వాటం మిడిలార్డర్ బ్యాటర్, రైట్ ఆర్మ్ మీడియం బౌలర్ అయిన విజయ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 4253 పరుగులు, లిస్ట్-ఏలో 2790, టీ20ల్లో 2583 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 154 వికెట్లు కూడా తీశాడు.
తమిళనాడు జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించిన విజయ్.. విజయ్ హజారే ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలను గెలిపించాడు. 2025-26 సీజన్‌కు ముందు విజయ్ త్రిపుర జట్టుకు మారాడు. విజయ్ తన చివరి రంజీ మ్యాచ్‌లో గుజరాత్‌పై అజేయంగా 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
విజయ్ ఐపీఎల్ ప్రస్తానాన్ని పరిశీలిస్తే.. 2014 అరంగేట్రం చేసిన ఇతగాడు.. 2025 వరకు 78 మ్యాచ్‌లు ఆడి 1233 పరుగులు, 9 వికెట్లు తీశాడు. ఐపీఎల్ కెరీర్‌లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన విజయ్‌ను.. 2026 సీజన్ వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. గత సీజన్ విజయ్ సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహించి 6 మ్యాచ్‌ల్లో 118 పరుగులతో పర్వాలేదనిపించాడు.


