ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టికర్త లలిత్ మోదీ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. 2030 నాటికి ఐపీఎల్ ప్రపంచ క్రీడారంగంలో ఎన్‌బీ , ఎన్‌ఎఫ్ఎల్ వంటి దిగ్గజ లీగ్‌లతో సమానంగా నిలుస్తుందని మోదీ అంచనా వేశాడు. అంతేకాకుండా టాప్ ఆటగాళ్లు ఒక్కో సీజన్‌కు రూ. 130 నుంచి రూ. 150 కోట్ల వరకు సంపాదిస్తారని అతడు జోస్యం చెప్పాడు.
లలిత్ మోదీ తాజాగా ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ మైఖల్ వాన్‌తో కలిసి 'ది ఓవర్‌ల్యాప్' పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగానే ఒక్కో ఫ్రాంచైజీకి రూ.125 కోట్లుగా ఉన్న ప్లేయర్ పర్స్ విలువ, రాబోయే నాలుగేళ్లలో ఏడు రెట్లకు పైగా పెరగనుందని అతడు చెప్పుకొచ్చాడు.
"ఐపీఎల్ ప్రపంచంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా మారుతోంది. ఫ్రాంచైజీలకు ఆటగాళ్లపై ఖర్చు చేయడానికి ఒక నిర్దిష్ట మొత్తం ఉంటుంది. ప్రస్తుతం పర్స్ విలువ రూ.125 కోట్లుగా ఉంది. కానీ 2030 నాటికి ఈ మొత్తం ఏకంగా 100 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 932 కోట్లు) చేరుకుంటుంది.
దీంతో సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడే అగ్రశ్రేణి ఆటగాళ్లు, ఒక్కో మ్యాచ్‌కు ఒక మిలియన్ డాలర్ (రూ. 8 కోట్లు) చొప్పున పారితోషకం అందుకుంటారు. అంటే మొత్తంగా 16 మ్యాచ్‌లకు సుమారుగా రూ. 140 నుంచి రూ.150 కోట్లు దక్కనుంది" అని లలిత్ మోదీ పేర్కొన్నాడు.
ఈ భారీ మొత్తాన్ని అందుకునే సత్తా ఉన్న 'ఎక్స్-ఫాక్టర్' ప్లేయర్లుగా ఇద్దరు యువ ఆటగాళ్లను మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒకరు రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కాగా.. మరొకరు ఇంగ్లండ్ యంగ్ క్రికెటర్ జాకబ్ బెథెల్. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ దుమ్ములేపుతున్నాడు.
తన సంచలన బ్యాటింగ్‌తో బుమ్రా, హేజిల్‌వుడ్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లకు సైతం వైభవ్ చుక్కలు చూపించాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ 263.16 స్ట్రైక్ రేటుతో 200 పరుగులు చేశాడు. కాగా ఐపీఎల్-2027 మెగా వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్ వైభవ్‌ను విడిచిపెడితే అతడిని భారీ ధరకు దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
చదవండి: IPL 2026: వరుస ఓటములు.. హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం!


