‘పంచ్‌’మే దమ్‌ హై... బాక్సింగ్‌ బరిలోకి ‘నవ రత్నాలు’

Tokyo Olympics 2021 9 Boxers Participate From India - Sakshi

భారత బాక్సర్లపై భారీ ఆశలు

‘టోక్యో’ బరిలో తొమ్మిది మంది

ఫేవరెట్స్‌ అమిత్, మేరీకోమ్‌

ఒలింపిక్స్‌ క్రీడల్లో ఒకప్పుడు భారత బాక్సర్లది ప్రాతినిధ్యమే కనిపించేది. బరిలోకి దిగడం... ఆరంభ రౌండ్‌లలోనే వెనుదిరగడం జరిగేది. కానీ 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో విజేందర్‌ సింగ్‌ ఈ ట్రెండ్‌ను మార్చాడు. తన పంచ్‌ పవర్‌తో సత్తా చాటి కాంస్య పతకాన్ని అందించాడు. విశ్వ క్రీడల్లో పతకం నెగ్గిన తొలి భారతీయ బాక్సర్‌గా చరిత్ర సృష్టించాడు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్‌ తొలిసారి ప్రవేశపెట్టగా... ‘మణిపూర్‌ మెరిక’ మేరీకోమ్‌ కాంస్య పతకంతో తిరిగొచ్చింది. 2016 రియో ఒలింపిక్స్‌లో మాత్రం మన బాక్సర్లకు నిరాశఎదురైంది. ఈసారి ఆ గాయం మానేందుకు భారత బాక్సర్లు భారీ కసరత్తే చేశారు. కరోనా రూపంలో కష్టకాలం ఎదురైనా, ఆంక్షలు అడుగులకు అడ్డుపడినా అలుపెరగని పట్టుదలతో టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. ఇక చివరి పరీక్షకు సిద్ధమయ్యారు. పురుషుల విభాగంలో ఐదుగురు... మహిళల విభాగంలో నలుగురు భారత బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ తొమ్మిది మందిలో అమిత్‌ పంఘాల్, మేరీకోమ్‌లు కచ్చితంగా పతకాలతో తిరిగొస్తారని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. ‘టోక్యో’లో బరిలోకి దిగనున్న భారత బాక్సింగ్‌ ‘నవ రత్నాల’ గురించి తెలుసుకుందాం..!

అమిత్‌ పంఘాల్‌ (52 కేజీలు)
హరియాణాకు చెందిన 25 ఏళ్ల అమిత్‌పై భారత్‌ గంపెడాశలు పెట్టుకున్నాడు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రింగ్‌లో కింగ్‌ అయ్యేందుకు ఈ ప్రపంచ నంబర్‌వన్‌ బాక్సర్‌ చెమటోడ్చుతున్నాడు. తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడనున్న అమిత్‌ గత నాలుగేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఆసియా చాంపియన్‌షిప్‌ (2017)లో కాంస్యం నెగ్గిన ఈ యువ బాక్సర్‌... ప్రపంచ చాంపియన్‌షిప్, కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతాలు గెలిచాడు. 2018 ఆసియా గేమ్స్‌లో చాంపియన్‌గా నిలిచాడు. ‘టోక్యో’లో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగనున్న అమిత్‌కు క్వార్టర్‌ ఫైనల్‌ వరకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. క్వార్టర్‌ ఫైనల్‌ అడ్డంకిని దాటి సెమీస్‌ చేరితో అమిత్‌కు పతకం ఖాయమే.

మనీశ్‌ కౌశిక్‌ (63 కేజీలు)
విజేందర్‌ 2008 ఒలింపిక్స్‌లో గెలిచిన కాంస్యమే మనీశ్‌ను బాక్సింగ్‌ కలల్లో ముంచెత్తింది. అదే లోకంగా ఎదిగి... బాక్సింగ్‌లో ఒదిగాడు. ఇప్పుడు మొదటి ఒలింపిక్స్‌లో పంచ్‌ విసిరేందుకు సిద్ధమయ్యాడు. మనీశ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచాడు. అన్నట్లు... ఇతని ఒలింపిక్స్‌ ‘కల’కు గతేడాది గాయమైంది. చిత్రంగా మెగా ఈవెంట్‌ వాయిదా పడటం వరమైంది. లేదంటే విశ్వక్రీడల ముచ్చటకు మరో మూడేళ్లు పట్టేది. జోర్డాన్‌లో జరిగిన ఆసియా ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌లో గాయపడ్డాడు. తర్వాత కరోనా బారినపడ్డాడు. ఇప్పుడైతే టోక్యో బాట పట్టాడు.

పూజా రాణి (75 కేజీలు)
బాక్సింగ్‌ ప్రారంభంలో గ్లౌజులు వేసుకునేందుకే తెగ ఇబ్బందిపడిన పూజ తర్వాత కఠోరశ్రమతో బాక్సర్‌గా ఎదిగింది. 2016లో దీపావళి వేడుకల్లో చేతులు కాల్చుకోవడం... కోలుకున్న తర్వాత మరుసటి ఏడాదే భుజానికి తీవ్ర గాయం వల్ల ఆమె కెరీర్‌ ముగిసిపోయే ప్రమాదంలో పడింది. అయినా సరే ఒలింపిక్స్‌ అర్హతే లక్ష్యంగా తన ఫిట్‌నెస్, ప్రదర్శనను మెరుగుపర్చుకొని చివరకు టోక్యో బాటపట్టింది.

సతీశ్‌ కుమార్‌ (ప్లస్‌ 91 కేజీలు)
భారత్‌ తరఫున హెవీ వెయిట్‌ కేటగిరీలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి బాక్సర్‌ సతీశ్‌. జట్టులో పెద్ద వయస్కుడు కూడా అతనే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 32 ఏళ్ల ఈ బాక్సర్‌కు ఇదే తొలి ఒలింపిక్స్‌. కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించాడు. విశ్వక్రీడల కోసం నిత్యం శ్రమించిన సతీశ్‌ ప్రత్యర్థులపై ముష్ఠిఘాతాలు విదిల్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.

 

ఆశిష్‌ కుమార్‌ (75 కేజీలు)
బీజింగ్‌లో విజేందర్‌ సింగ్‌ చరిత్రకెక్కిన వెయిట్‌ కేటగిరీలో ఆశిష్‌ కుమార్‌ తొలిసారి ఒలింపిక్స్‌ బరిలోకి దిగుతున్నాడు. ఆశిష్‌ను ఒలింపియన్‌గా చూడాలన్న లక్ష్యం అతని తండ్రిది కాగా... అతను అర్హత సాధించడానికి సరిగ్గా నెలముందే తండ్రి కన్నుమూశాడు. దీన్ని జీర్ణించుకోవడం కష్టమైనా... తండ్రి లక్ష్యం తనని టోక్యో దాకా నడిపించింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల ఆశిష్‌ 2019 ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచాడు. ఇప్పుడు ఒలింపిక్‌ పతకాన్ని సాధించి తండ్రికి ఆంకితమివ్వాలనే ఆశయంతో ఉన్నాడు.

వికాస్‌ కృషన్‌ (69 కేజీలు)
బాక్సింగ్‌ జట్టులో అనుభవజ్ఞుడైన ఒలింపియన్‌ వికాస్‌. 2012 లండన్, 2016 రియో ప్రయత్నాల్లో కలగానే మిగిలిపోయిన ఒలింపిక్‌ పతకాన్ని టోక్యోలో నిజం చేసుకునేందుకు పగలురాత్రి అనకుండా కష్టపడుతున్నాడు. 29 ఏళ్ల ఈ హరియాణా బాక్సర్‌ ఏడాదికి పైగా ఇంటి ముఖమే చూడలేదు. తన రెండు కళ్లు పతకాన్నే చూస్తుండటంతో... తను కన్న పిల్లల్ని  ఫోన్‌లోనే చూసుకుంటున్నాడు. బహుశా ఇదే తన కెరీర్‌కు ఆఖరి ఒలింపిక్స్‌ అనుకుంటున్న వికాస్‌ పంచ్‌లకు అనుభవం కూడా తోడుగా ఉంది.
 

మేరీకోమ్‌ (51 కేజీలు)
ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన మేరీకోమ్‌ ఇప్పుడు ఒలింపిక్‌ స్వర్ణంపై గురిపెట్టింది. రెండు దశాబ్దాలుగా బాక్సింగ్‌ రింగ్‌లో ప్రత్యర్థుల్ని దడదడలాడిస్తున్న 38 ఏళ్ల మేరీకిది చివరి ఒలింపిక్స్‌... దీంతో పతకం వన్నే మార్చేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉంది. లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన మేరీ తాజా వేటలో ఎదురయ్యే ప్రత్యర్థుల్ని చిత్తు చేసేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది.  

సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (60 కేజీలు)
దినసరి కూలీల కుటుంబం నుంచి వచ్చి దీటైన బాక్సర్‌గా ఎదిగిన సిమ్రన్‌జిత్‌ ఒలింపిక్స్‌ పతకంతోనైనా తన కుటుంబకష్టాలు తీరుతాయనే ఆశతో ఉంది. 26 ఏళ్ల ప్రతిభావంతురాలైన ఈ బాక్సర్‌కు పంజాబ్‌ ప్రభుత్వం ఉద్యోగం హామీని నిలబెట్టుకోలేకపోయింది. కూలీ పనిచేసే తండ్రి 2018లో మరణించడంతో కుటుంబానికి సిమ్రన్‌జితే పెద్దదిక్కయింది. ఓ వైపు ఆర్థిక సమస్యలతో పోరాడుతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆమె మరోవైపు రింగ్‌లో ప్రత్యర్థులతోనూ ‘ఢీ’కొడుతోంది.

లవ్లీనా బొర్గొహైన్‌ (69 కేజీలు)
యువ బాక్సర్‌ లవ్లీనా ప్రాథమిక విద్యను అభ్యసించే రోజుల్లోనే బాక్సింగ్‌ ఆటపై మనసు పెట్టింది. సాంకేతికంగా పంచ్‌ పవర్‌లో మేటి అయిన 23 ఏళ్ల ఈ అస్సాం బాక్సర్‌ ప్రత్యర్థుల పని పట్టడంలో దిట్ట. 20 ఏళ్ల వయసులో 2018 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచింది. మరుసటి ఏడాది కూడా కాంస్యాన్ని చేజిక్కించుకుంది. ఈ ఏడాది దుబాయ్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ కాంస్యం నెగ్గింది. అయితే గతేడాది కీలకమై ఇటలీ శిక్షణకు కరోనా వల్ల దూరమైంది. తీరా విమానం ఎక్కబోయే రోజు ముందు వైరస్‌ సోకినట్లు రిపోర్టు రావడంతో ఇంటికే పరిమితమైంది. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top