Mary Kom: నాకింకా వయసైపోలేదు. మరో నాలుగేళ్లు ఆడతా

Mary Kom Says I Still Have Age Can Play Till 40 Returning To India - Sakshi

న్యూఢిల్లీ: బాక్సింగ్‌ ఆడే సత్తా తనలో ఇంకా ఉందని.. 40 ఏళ్లు వచ్చేవరకు బాక్సింగ్‌ రింగ్‌ బరిలో ఉంటానని భారత​బాక్సర్‌ మేరీకోమ్‌ తెలిపింది. టోక్యో ఒలింపిక్స్‌లో  భారీ అంచనాలతో బరిలోకి దిగిన మేరీకోమ్‌ అనూహ్యంగా ప్రీక్వార్టర్స్‌లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఓటమి అనంతరం శనివారం స్వదేశానికి చేరుకున్న మేరీకోమ్‌కు విమానాశ్రయంలో దిగిన వెంటనే మీడియా నుంచి ఒక ప్రశ్న ఎదురైంది. ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయారు.. ఇక బాక్సింగ్‌కు వీడ్కోలు పలుకుతారా అని ప్రశ్నించారు.

మేరీకోమ్‌ స్పందింస్తూ.. 'టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తీసుకురాకపోవడం బాధను కలిగింది. కచ్చితంగా పతకంతో తిరిగి వస్తానని అనుకున్నా. నా వరకు నేను మంచి ప్రదర్శననే చేశా. ప్రీక్వార్టర్స్‌ మ్యాచ్‌లో న్యాయ నిర్ణేతలు తీరు సరిగా లేదు. తొలి రెండు రౌండ్లు గెలిచిన నేను ఎందుకు ఓడిపోతాను. బౌట్‌కు ముందు అధికారులు నా దగ్గరకు వచ్చి మీ సొంత జెర్సీని వాడకూడదు.. అని చెప్పారు.

అయితే నేను ఆడిన తొలి మ్యాచ్‌లోనూ అదే జెర్సీ వేసుకున్నా.. అప్పుడు చెప్పని అభ్యంతరం ప్రీక్వార్టర్స్‌లో ఎందుకు చెప్పారో అర్థం కాలేదు. కేవలం నా మానసిక ఆందోళన దెబ్బతీయడానికే జడ్జిలు అలా చేశారని అనిపిస్తుంది. ఇతర దేశాలకు లేని నిబంధనలు మనకే ఎందుకు'' అంటూ ప్రశ్నించింది. ఇక రిటైర్మెంట్‌పై మేరీ కోమ్‌ మాట్లాడుతూ.. ''నా వయసు ఇంకా అయిపోలేదు.. 40 ఏళ్లు వచ్చేవరకు బాక్సింగ్‌లో కొనసాగుతా.. అవసరమైతే వచ్చే ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తా'' అంటూ చెప్పుకొచ్చింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top