
నేడు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్
ఆసియా కప్‌లో దాయాదుల పోరు
రా.గం.8 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో...
సరిహద్దు ఉద్రిక్తతలు, విభేదాలు, వివాదాలు, విమర్శలు ఎన్ని ఉన్నా క్రికెట్ మైదానానికి వచ్చే సరికి ఈ మ్యాచ్ ఫలితంపై అందరి దృష్టీ పడుతుంది... బలాబలాల మధ్య ఆకాశమంత అంతరం ఉన్నా ఆసక్తి విషయంలో ఎక్కడా లోటుండదు. ఆటగాళ్లు మారినా, వేదికలు మారినా అభిమానుల్లో ఈ పోరు కొత్త ఉత్సాహాన్ని రేపుతుంది.
దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్‌లో జరిగే మ్యాచ్‌లో నేడు తలపడనున్నాయి. పహల్గావ్ ఘటనను దృష్టిలో ఉంచుకొని మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ ఎన్నో వైపులనుంచి పిలుపులు వచ్చినా క్రికెటర్లు, నిర్వాహకులు, ప్రసారకర్తలు తమ పని తాము చేసుకుంటూ మ్యాచ్‌కు బహుళ ప్రచారాన్ని కల్పిస్తున్నారు.
దుబాయ్: ఆసియా కప్ లీగ్ దశలో మొత్తం 12 మ్యాచ్‌లు జరుగుతాయి. మిగతా 11 మ్యాచ్‌లపై ఆసక్తి, ప్రేక్షకుల స్పందన చూస్తే అతి పేలవం. టోర్నీని నిలబెట్టగలిగే, భాగస్వాములకు కాస్త ఆర్థిక పుష్టి అందించే మ్యాచ్ ఏదైనా ఉందంటే అది భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే పోరు మాత్రమే. గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ తర్వాత ఈ రెండు టీమ్‌లు ఈ ఫార్మాట్‌లో తలపడటం ఇదే మొదటిసారి.
భారత్ తరఫున సీనియర్లు రోహిత్, కోహ్లి నిష్క్రమించగా...పాక్ జట్టుకు బాబర్, రిజ్వాన్ దూరమయ్యారు. దాంతో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు తమ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. ఆసియా కప్‌లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లో యూఏఈని భారత్ చిత్తు చేయగా...ఇదే తరహాలో ఒమన్‌పై పాక్ విజయం సాధించింది.
అదే జట్టుతో...
టోర్నీ తొలి పోరులో తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగిన భారత్ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఆ మ్యాచ్‌లో బౌలర్లంతా ఆకట్టుకోగా, ఓపెనర్లకు మినహా మిగతావారికి బ్యాటింగ్ అవకాశమే రాలేదు. అభిషేక్ శర్మ మరోసారి విధ్వంసకర బ్యాటింగ్‌కు సై అంటుండగా, మరో ఓపెనర్ గిల్ కూడా పాక్‌పై చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. గిల్ ఇప్పటి వరకు పాకిస్తాన్‌పై ఒక్క టి20 మ్యాచ్ కూడా ఆడలేదు. పాక్‌పై ఇప్పటి వరకు 20 పరుగులు దాటలేకపోయిన సూర్యకుమార్ యాదవ్ కూడా లెక్క సరి చేసేందుకు సిద్ధమయ్యాడు.
సంజు, తిలక్, దూబే, హార్దిక్‌లతో విధ్వంసకర లైనప్ టీమిండియాకు భారీ స్కోరును అందించగలదు. ఆల్‌రౌండర్‌గా అక్షర్ తన విలువ చూపిస్తే పాక్‌కు ఇబ్బంది తప్పదు. బుమ్రా ప్రమాదకర బౌలింగ్‌ను పాక్ బ్యాటర్లు ఏమాత్రం ఎదుర్కోగలరనేది సందేహమే. పాండ్యా, దూబేల రూపంలో ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉండటంతో రెండో పేసర్ అవసరం జట్టుకు లేదు. కుల్దీప్, వరుణ్‌లను ప్రత్యర్థిని పూర్తిగా కట్టిపడేయగల సమర్థులు.
పిచ్, వాతావరణం
దుబాయ్‌లో సాధారణంగా భారీ స్కోర్లు నమోదు కావు. అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు కూడా మంచి ప్రభావం చూపే అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్షసూచన లేదు కానీ క్రికెటర్లు తీవ్రమైన ఎండలను తట్టుకోవాల్సి ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, గిల్, సామ్సన్, తిలక్, శివమ్ దూబే, పాండ్యా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, వరుణ్.
పాకిస్తాన్: సల్మాన్ ఆగా (కెప్టెన్), ఫర్హాన్, అయూబ్, ఫఖర్, హసన్, హారిస్, నవాజ్, ఫహీమ్, అఫ్రిది, ముఖీమ్, అబ్రార్