ధోని తరహాలో.. చివరి బంతికి సిక్స్‌ కొట్టి

A Thrilling Final Over Last Ball Six Helps Team To Enter Semifinal - Sakshi

అహ్మదాబాద్‌: టీ20 అంటేనే ఉత్కంఠకు పేరు... ఇన్నింగ్స్‌ చివరి బంతి వరకు ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాడుతూనే ఉంటుంది. అంతర్జాతీయ టీ20లు, ఐపీఎల్‌, బిగ్‌బాష్‌ వంటి టోర్నీలలో జరిగిన కొన్ని మ్యాచ్‌లు అభిమానులకు థ్రిల్‌ కలిగించడమే గాక వారిని మునివేళ్లపై నిలబెట్టేలా చేశాయి. తాజాగా దేశవాలీ టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో భాగంగా బుధవారం బరోడా, హర్యానాల మధ్య జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ థ్రిల్లర్‌ను తలపించింది. బరోడా బ్యాట్స్‌మన్‌ విష్ణు సోలంకి చివరి బంతికి ధోని తరహాలో హెలికాప్టర్‌ సిక్స్‌ కొట్టి జట్టును సెమీస్‌ చేర్చాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన హర్యానా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బరోడా జట్టు ఆరంభం నుంచి దూకుడుగానే ఆడింది. ఓపెనర్‌ స్మిత్‌ పటేల్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విష్ణు సోలంకి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 46 బంతుల్లోనే 71 పరుగులతో వీరవిహారం చేశాడు. సోలంకి దాటిని చూస్తే మాత్రం బరోడా ఈజీగానే మ్యాచ్‌ను గెలవాల్సి ఉండేది. కానీ ఇదే సమయంలో 19వ ఓవర్‌ వేసిన హర్యానా బౌలర్‌ మోహిత్‌ శర్మ అద్భుతమైన బౌలింగ్‌ చేశాడు. మోహిత్‌ వేసిన ఓవర్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే రావడంతో చివరి ఓవర్‌కు బరోడా జట్టు విజయానికి 6 బంతుల్లో 18 పరుగులు కావాల్సి వచ్చింది.చదవండి: 'పైన్‌ను తీసేయండి.. అతన్ని కెప్టెన్‌ చేయండి'

ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ వేసిన సుమిత్‌ కుమార్‌ వేయగా.. మొదటి బంతికి సింగిల్‌ వచ్చింది. రెండో బంతిని విష్ణు సోలంకి ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను సుమీత్‌ వదిలేశాడు. ఆ తర్వాత బంతికి సింగిల్‌ రావడంతో బరోడాకు 3 బంతుల్లో 15 పరుగులు కావాల్సి వచ్చింది. నాలగో బంతిని సిక్స్‌ కొట్టిన సోలంకి.. ఐదో బంతిని ఫోర్‌గా మలిచాడు. ఇక చివరి బంతికి 5 పరుగులు అవసరమైన దశలో సోలంకి.. ధోని ఫేవరెట్‌ షాట్‌ అయిన హెలికాప్టర్‌ సిక్స్‌తో జట్టును ఒంటిచేత్తో సెమీస్‌కు చేర్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సోలంకి ఆడిన హెలికాప్టర్‌ షాట్‌ను చూస్తే ధోని మెచ్చుకోకుండా ఉండలేడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.చదవండి: టాప్‌లో కోహ్లి.. రెండుకే పరిమితమైన రోహిత్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top