
సౌతాఫ్రికా సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికా.. 27 ఏళ్ల తర్వాత రెండో ఐసీసీ టైటిల్‌ను ముద్దాడింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసిన సఫారీలు.. టెస్టు ఛాంపియన్‌షిప్ గదను సొంతం చేసుకుకున్నారు.
ఆసీస్ నిర్ధేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని ప్రోటీస్ 5 వికెట్ల కోల్పోయి చేధించింది. మ్యాన్ ఆప్‌ది మ్యాచ్ ఐడైన్ మార్‌క్రమ్(136) సౌతాఫ్రికా చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు బావుమా(66) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అదేవిధంగా బౌలర్లు కూడా రెండు ఇన్నింగ్స్‌లలో అద్బుతంగా రాణించారు.
కగిసో రబాడ ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు పడగొట్టగా.. లుంగీ ఎంగిడీ మూడు, జానెసన్ నాలుగు వికెట్లు సాధించారు. ఇక ఈ అద్బుత విజయంపై మ్యాచ్ అనంతరం టెంబా బావుమా స్పందించాడు. ఈ రోజు కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామని బావుమా తెలిపాడు.
"ఈ విజయం మాకు చాలా ప్రత్యేకం. ముందుగా మాకు ఇక్కడ సపోర్ట్‌గా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. వారి మద్దతు నాకు దక్షిణాఫ్రికాలో ఆడుతున్న అనుభూతిని కలిగించింది. ఈ క్షణం కోసమే మేము ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాము. అందుకోసం చాలా కష్టపడ్డాము. మా కంటూ ఒక రోజు వస్తుందని అని నమ్మకంతో ముందుకు సాగాము.
కానీ అదే సమయంలో చాలా సందేహాలు కూడా ఉండేవి. కానీ వాటన్నంటిని ఈ రోజు మేము జయించాము. ఒక జట్టుగా మాకు ఇది గర్వించదగ్గ విజయం. ఈ విజయం కోసమే ఎన్నో ఏళ్లగా ప్రయత్నిస్తున్నాము. సెమీఫైనల్స్, ఫైనల్స్‌లో ఓడిపోయి హృదయ వేదన అనుభవించాము. కానీ ఎక్కడ కూడా మేము వెనకడుగు వేయలేదు.
అదే ఎనర్జీ, అదే పోరాట పటిమతో మా ప్రయాణాన్ని కొనసాగించాము. ఎట్టకేలకు మా లక్ష్యాన్ని చేరుకున్నాము. కగిసో రబాడ ఇక అద్బుతమైన ఆటగాడు. రెండు రోజుల క్రితం నేను ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్ ఈవెంట్‌కు వెళ్లాను. రాబోయే కాలంలో రబాడ కచ్చితంగా ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకుంటాడని భావిస్తున్నాను.
అతడు ఈ మ్యాచ్‌కు ముందు ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అయినప్పటికి ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఛాంపియన్ ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు మార్‌క్రమ్ గురుంచి ఎంత చెప్పిన తక్కువే. మార్‌క్రమ్ టెస్టు జట్టులో ఎందుకు అని చాలా మంది ప్రశ్నించారు. వారిందరికి మార్‌క్రమ్ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.
రెండో ఇన్నింగ్స్‌లో ఎవరో ఒకరు చివరి వరకు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నాము. ఆ బాధ్యతను మార్‌క్రమ్ తీసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఇటువంటి ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు మాటలు కూడా రావడం లేదు. మా దేశ ప్రజలు కూడా మా సెలబ్రేషన్స్‌లో భాగం అవుతారని భావిస్తున్నాను" అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బావుమా పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో టెంబా బావుమా పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. సౌతాఫ్రికాకు రెండో ఐసీసీ టైటిల్ అందిచిన కెప్టెన్‌గా బావుమా చరిత్ర పుటలెక్కాడు.
చదవండి: WTC Final 2025: ఛాంపియన్ దక్షిణాఫ్రికాకు ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?